కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే! | Funday Special Story On Honesty Earned A Royal Job Inspirational | Sakshi
Sakshi News home page

కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే!

Aug 2 2026 1:43 PM | Updated on Aug 2 2026 1:53 PM

Funday Special Story On Honesty Earned A Royal Job Inspirational

పిల్లల కథ

కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద పడుకునేవాడు.  చిన్ననాటి నుంచి గుడి పూజారి దగ్గర ధర్మబద్ధంగా జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నాడు. తను ఒక చోట కూలీ పనికి ఒప్పుకుంటే మరొకరు వచ్చి ఎక్కువ కూలీ ఇస్తామన్నా ససేమిరా ఒప్పుకునే వాడు కాదు.  ఊరి వాళ్ళు, తోటి కూలీలు ఇతని నిజాయతీని చూసి నవ్వుకునే వాళ్ళు. కేశవుడు మాత్రం ధర్మం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని నమ్మేవాడు.

ఒకరోజు కోసల రాజు విక్రమసేనుని ఉద్యానవనంలో తోటపని చేయడానికి  ముకుందపురం నుంచి కూలీలతో పాటు కేశవుడు కూడా వెళ్ళాడు. కేశవుడు తోటలో పని చేస్తున్నప్పుడు ఒక రంగురాయి దొరకటంతో దాని గురించి ఎవరికీ చెప్పకుండా బొడ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. సాయంత్రం వరకు తోటలో పనిచేసి, కూలి డబ్బులు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరుతూ, మెల్లగా రాజప్రాసాదంవైపు అడుగులు వేశాడు. సింహద్వారం వద్ద భటులతో తను రాజుగారిని కలవాలి అని చెప్పాడు. విషయం ఏమిటని భటులు ప్రశ్నిస్తే విషయం కేవలం రాజుగారికి మాత్రమే చెబుతాను అనటంతో ఒక భటుడు అంతఃపురంలోకి వెళ్ళి వచ్చి, ‘‘రేపు ఉదయం వరకు రాజుగారిని కలవటం కుదరదు, పొద్దున్నే రాపో’’ అని చెప్పారు.

కేశవుడు చేసేది లేక ఊరికి వెళ్లకుండా, సింహద్వారం పక్కగా ఒక చోట ఒదిగి కూర్చొని రాత్రంతా అక్కడే గడిపాడు. అలసిపోయి అక్కడే పడుకున్న కేశవుడిని ఉదయాన్నే ఒక  భటుడు నిద్రలేపి, ‘‘రాజుగారు పిలుస్తున్నారు’’ అని చెప్పటంతో భయం భయంగా కోటలోకి అడుగు పెట్టాడు. కోసల రాజు విక్రమసేనుడు కేశవుడిని చూసి ‘‘నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?’’ అని అడిగాడు. 

కేశవుడు రాజుగారికి నమస్కరించి, ‘‘మహారాజా! నిన్న తమరి తోటలో పనిచేస్తుంటే, నాకు ఈ రంగురాయి దొరికింది. తమరి వస్తువు తమరికే అప్పగించి పోదామని వచ్చాను’’ అని చెప్పి, తన బొడ్లో జాగ్రత్తగా దాచుకున్న రంగురాయిని విక్రమసేనుడికి అప్పగించాడు.  
రంగురాయిని తీసుకున్న విక్రమసేనుడు ‘‘దీని విలువ ఎంతో నీకు తెలుసునా?’’ అని అడిగాడు.  
‘‘నాది కాని వస్తువు విలువ ఎంత అయితే నాకెందుకు మహారాజా!’’ అన్నాడు కేశవుడు వినయంగా.

ఇంతలో అక్కడకు వచ్చిన మహామంత్రి సూరవర్మ ‘‘ప్రభూ! మన ఖజానాలో పని చేయటానికి నిజాయతీ గల వ్యక్తి కావాలన్నారు కదా, అందుకు ఇతనే సరైన వ్యక్తి. నిజాయతీ గల వ్యక్తి కోసం వెదుకులాటలో భాగంగా తమరి తోటలో చాలా రంగు రాళ్లని నేనే కావాలని భూమిలో పాతించి, కూలీలను అందులో పనికి పురమాయించి, దూరం నుంచి గమనిస్తూనే వున్నాను. ఇతనితో పాటు మరికొందరికి ఈ రంగురాళ్ళు దొరికాయి.

ఇవి విలువ చేయని రంగురాళ్ళు అని తెలియక మిగతా అందరూ లోలోపల సంతోషపడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. కాని, ఇతను మాత్రం ఆశకు లోను కాకుండా నిజాయతీగా ఈ రంగురాయిని తమకు అప్పగించడానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా నేను కావాలనే ఇతనికి తమ దర్శన భాగ్యం కలిగించలేదు. ఆ రంగురాయి ఒక రాత్రంతా ఇతని దగ్గర వుంటే ఇతని మనసు ఏమైనా చాంచల్యానికి  లోనవుతుందేమో అనుకున్నాను. అయినా, ఇతను తన నిజాయతీని కోల్పోలేదు’’ అని చెప్పాడు.

‘‘మహామంత్రీ! మీరు చెప్పింది నిజమే, తక్షణమే ఇతనిని మన ఖజానా ఉద్యోగిగా నియమించండి. వెంటనే ఇతని నివాసానికి రాజోద్యోగుల భవంతిని ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పి విక్రమసేన మహారాజు లోనికి వెళ్లిపోయాడు.
ముకుందపురం చేరుకున్న కేశవుడు గుడి పూజారిని కలుసుకొని, తనకు వచ్చిన కొలువు గురించి చెప్పి, పాదాలకు నమస్కరించాడు.  
‘‘నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. లే నాయనా!’’ అని కేశవుడిని లేవదీసి, ఆలింగనం చేసుకున్నాడు పూజారి.
- ఎన్‌.వి.శ్రీధర శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement