కథాకళి
‘‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’’
‘‘నీకు పిచ్చా?’’ వెంటనే అడిగాను.
‘‘అదో కారు ప్రమాదంలో జరిగింది. నువ్వు నీ భార్యని, ఇద్దరు పిల్లలని వదిలి ఇక్కడికి వచ్చావు. నీది బాధలేని తక్షణ మరణం.’’
‘‘నేను... నేను నిజంగా చచ్చిపోయానా?
‘‘అవును.’’
నేను చుట్టూ చూశాను. అంతా శూన్యం. ఆశ్చర్యంగా భూమి కాని, ఆకాశం కాని కనపడలేదు. కేవలం అతను, నేను మాత్రమే ఉన్నామని గ్రహించాను.
‘‘ఈ ప్రదేశం ఏమిటి? ఇదేనా మరణానంతర జీవితం?’’ అడిగాను.
‘‘అవును.’’ అతను చెప్పాడు.
‘‘నువ్వు దేవుడా?’’
‘‘అవును. నేను దేవుడిని.’’ అతను బదులు చెప్పాడు.
నేను ఆసక్తిగా చూశాను. అతను దేవుడిలా కనిపించలేదు. సర్వశక్తిమంతుడిలా కూడా కాదు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిలా కనిపించాడు.
‘‘నా భార్య, పిల్లలు నా గురించి ఏడుస్తున్నారా?’’
‘‘నీ భార్య పైకి ఏడుస్తూ లోపల ఉపశమనం పొందుతోంది. ఐతే నీకు ఊరటని ఇచ్చేది, ఉపశమనం పొందినందుకు ఆమెలో చాలా అపరాధభావం ఉంది.’’
‘‘ఇప్పుడు నేను స్వర్గానికో, నరకానికో లేక ఇంకెక్కడికైనా వెళ్తానా?’’ అడిగాను.
‘‘రెండూ కాదు. నువ్వు పునర్జన్మ ఎత్తుతావు.’’
‘‘అంటే భగవద్గీతలో చెప్పింది నిజమే అన్నమాట.’’
‘‘ప్రతి మతం దాన్నే తనదైన పద్ధతిలో చెప్పింది.’’
‘‘నేను మళ్ళీ జన్మించాక ఓ ఖాళీ పలకలా ఉంటానా? పసిబిడ్డలా. ఈ జీవితంలో నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు ఏవీ నాతో రావా?’’
‘‘నీ గత జన్మలన్నింటి జ్ఞానం నీలో ఉంది. కాని అవి నీకు ఇప్పుడు గుర్తులేవు. నీ ఆత్మ ఎంత అద్భుతమైందో, విశాలమైందో నీకు తెలీదు. నీ మనసు నీలోని అత్యంత చిన్న భాగాన్ని మాత్రమే ఇముడ్చుకోగలదు. అది నీళ్ళు వేడిగా ఉన్నాయో, చల్లగా ఉన్నాయో చూడటానికి గ్లాసు నీళ్ళలో వేలు ముంచడం లాంటిది. దాన్ని తిరిగి బయటకి తీసినప్పుడు, అది పొందిన అనుభవాలన్నీ నీలో నిక్షిప్తమవుతాయి. నువ్వు ఇంకా విస్తరించలేదు. నీ అపారమైన చైతన్యంలోని మిగిలినవన్నీ నువ్వు అనుభూతి చెందలేదు.’’
‘‘నేను ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తాను?’’
‘‘చాలాసార్లు. ఎన్నో రకాల జీవితాల్లోకి ప్రవేశించావు. సాంకేతికంగా చెప్పాలంటే నీకు తెలిసిన కాలం నువ్వు జీవించిన విశ్వంలో మాత్రమే ఉంటుంది. కాని కాలం నిజం కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు.’’
‘‘నేను గతంలో మరణించినప్పుడల్లా నీతో ఇలా సంభాషించానా?’’
‘‘అవును. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నువ్వు గుడ్డు మాత్రమే కాబట్టి అది నీకు గుర్తు లేదు.’’
‘‘దీని ప్రయోజనం?‘‘
‘‘నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిణతి చెందడమే.’’
‘‘నేను మాత్రమేనా? లేక మానవాళి మొత్తం పరిణతి చెందాలనా?’’
‘‘లేదు. కేవలం నువ్వు మాత్రమే. నేను ఈ విశ్వాన్ని నీ కోసమే సృష్టించాను. ప్రతి కొత్త జీవితంలో నువ్వు ఎదుగుతూ, పరిణతి చెందుతూ మరింతగా విస్తరిస్తావు.’’
‘‘నేనేనా? అంతానా?’’
‘‘మరెవరూ లేరు. ఈ విశ్వంలో నువ్వు మాత్రమే ఉన్నావు.’’
నేను అతని వంక పిచ్చివాడిని చూసినట్లుగా చూశాను.
‘‘భూమి మీది ప్రజలందరి మాటేమిటి?’’
‘‘అంతా నువ్వే. అవన్నీ నీ విభిన్న అవతారాలు.’’
‘‘ఆగాగు. నేను అందరినా !?’’
‘‘ఇప్పుడు నీకు అర్థమవుతోంది.’’
‘‘ఇప్పటివరకు జీవించిన ప్రతి మానవుడినీ నేనే?’’ తెల్లబోతూ అడిగాను.
‘‘అవును.’’
‘‘నేను గాంధీనా?’’
‘‘నువ్వు గాడ్సేవి కూడా.’’
‘‘నేనే హిట్లర్‌నా?’’ దిగ్భ్రాంతిగా అడిగాను.
‘‘అతను చంపిన లక్షలాదిమంది కూడా నువ్వే. నువ్వు ఎవరినైనా బాధించిన ప్రతిసారీ, నువ్వు నిన్నే బాధించావు. నువ్వు ఇతరులకి చేసిన ప్రతి మంచి పనీ నీకోసమే చేసుకున్నావు. ఏ మనిషైనా అనుభవించిన ప్రతీ సంతోషం, ప్రతీ బాధ నువ్వే అనుభవించావు, ఇకపైనా అనుభవిస్తావు.’’ అతను చెప్పాడు.
‘‘ఇదంతా ఎందుకు?’’
‘‘ఎందుకంటే ఏదో రోజు నువ్వు నాలా మారడానికి. నువ్వు నాలాంటి వాడివే. నిజానికి నువ్వే నేను. నేనే నువ్వు.’’
‘‘అంటే నేను కూడా దేవుడినా?’’
‘‘ఇంకా కాదు. నువ్వు నా ఊహవి. నేను నీ ఊహని. నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. సకల కాలాల్లోని ప్రతి మానవ జీవితాన్నీ నువ్వు గడిపిన తర్వాత, ప్రతీ జన్మలోనూ ఎదుగుతూంటావు.’’
‘‘ఐతే నేనో గుడ్డుని అన్నమాట.’’ నేను చెప్పాను.
‘‘అవును. నేను కూడా నీ గుడ్డుని. ఇప్పుడు నువ్వు నీ తర్వాతి జీవితానికి వెళ్ళే సమయం వచ్చింది.’’ అతను చెప్పాడు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి


