అప్పట్లో పోయినోళ్ల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వారి గురించి మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు పోయినోళ్ల గురించి కాదు.. ఏకంగా పోయినోళ్లతోనే మాట్లాడేస్తున్నారు... అదెలా సాధ్యమంటే, ఉందిగా ఏఐ... మరణించిన వారి ఫోటోలను, వీడియోలు, వాయిస్‌లను ఏఐకి ఇస్తే అది వాటిని ప్రాసెస్ చేసి అచ్చం చనిపోయినవారే బతికొచ్చినట్టు రీక్రియేట్ చేస్తుంది. దీంతో వారు మనతో ఉన్న భావన కలుగుతుంది. కాని ఈ వింత వైనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు.
సాంకేతిక పరిభాషలో ఇలాంటి చాట్‌బాట్స్‌ని గ్రిఫ్ బాట్స్, డెడ్ బాట్స్ అని పిలుస్తారు. మరణించిన వ్యక్తులను మిస్ అవుతున్నామని బాధపడేవారు ఇలా ఏఐ సాయంతో వారిని చూసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ సాంత్వన పొందుతున్నారు. కాని చావుపుట్టుకలు ప్రకృతి నైజం... వీటì కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి.
ఇటీవలే కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జాక్ మ్యానింగ్ నేతృత్వంలో ఈ డెడ్ బాట్స్ వల్ల మానసిక పరివర్తనలో మార్పులను తెలుసుకునేందుకు ఓ పరిశోధన చేశారు. కొందరు వ్యక్తులపై చేసిన ఈ పరిశోధనలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. నిజానికి కోల్పోయినవారిని తిరిగి చూస్తున్నామన్న ఆనందం సంబంధిత వ్యక్తుల్లో కనిపిస్తున్నా క్రమంగా అదో అలవాటులా మారుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. అంటే మరణించినవారు తిరిగిరారన్న వాస్తవాన్ని వారు అంగీకరించలేకపోతున్నారన్నమాట.
చట్టాలు లేవా? దీంతోపాటు నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరణించిన వ్యక్తి డిజిటల్ సమాచారాన్ని ఏఐ కోసం ఉపయోగించడానికి ముందస్తు అనుమతి అవసరమా? ఆ వ్యక్తి స్వరం, వ్యక్తిత్వం, సంభాషణా శైలిని పునర్నిర్మించే హక్కు ఎవరిది? గోప్యత, డేటా యాజమాన్యం, మరణానంతర హక్కులపై ఇప్పటికీ స్పష్టమైన నిబంధనలున్న చట్టాలే వీ ప్రస్తుతం అనేక దేశాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, దుఃఖం మాత్రం మానవ జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన భావోద్వేగమేనని, వాస్తవాలను అంగీకరించి జీవితాన్ని కొనసాగించడమే ఉత్తమమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు.


