సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతున్న అరవింద్ సుబ్రమణియన్. చిత్రంలో సీఎస్ సంజయ్ జాజు. రామకృష్ణారావు, రఘునందర్ రావు, ఇతర ఉన్నతాధికారులు
కృత్రిమ మేధతో జీఎస్టీ లోపాలకు అడ్డుకట్ట వేయొచ్చు
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడంపై సుదీర్ఘ చర్చ
ఆదాయ పెంపు మార్గాలపై సీఎం, అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సులభతర వాణిజ్యం మెరుగుపరిచేలా టెక్నాలజీ వినియోగించాలని సిఫార్సు
బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే లిక్కర్‌పై వ్యాట్ విధించాలని సూచన
వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించడం ద్వారా ఖజానాకు మరింత ఊతం తీసుకురావచ్చని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత సమాచారంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేలా సులభతర వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శుక్రవారం సాయంత్రం అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలు, ఇరు శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఏఐతో వ్యవస్థలను పటిష్టం చేసుకునే అంశాలపై అరవింద్ సుబ్రమణియన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
శాఖల మధ్య మరింత సమన్వయం అవసరం..
ఈ సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట వేసేందుకు, పన్ను లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుపరిచేలా టెక్నాలజీని వినియోగించాలని వివరించారు. ప్రధానంగా భవన నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం అవసరమన్నారు.
భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలను, అందుకు అనుగుణంగా పన్నుల అంచనాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ జీఎస్టీలో ఏఐ వినియోగం ద్వారా వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు.
ఈ డేటాతోపాటు మీ–సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను కూడా సమీకృతం చేయడం ద్వారా పరిపాలనకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హెచ్. హరికిరణ్, ముఖ్య పౌరసంబంధాల అధికారి (సీపీఆర్‌వో) గుర్రం మల్సూర్ పాల్గొన్నారు.
ఎక్సైజ్‌లో కీలక సంస్కరణల కోసం సూచన
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో భాగంగా ఎక్సైజ్ శాఖలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణల గురించి అరవింద్ సుబ్రమణియన్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే లిక్కర్‌పై వ్యాట్ విధించాలని (తద్వారా బార్లలో విక్రయించే లిక్కర్ ధరలు పెరుగుతాయి), బార్లు పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, సరఫరాదారులు, అన్ని రకాల బ్రాండ్‌లు తెలంగాణ మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించేలా నిబంధనల్లో మార్పులు తేవాలని సూచించారు.
అలాగే లిక్కర్ ధరల నిర్ధారణ (పెంచడం లేదా తగ్గించడం) విధానం కూడా సులభతరంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు లిక్కర్ సరఫరాదారులకు చెల్లింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా ఎక్సైజ్ ఆదాయం ఉంటోందని.. అయితే క్రమంగా ఇతర రాష్ట్రాల్లో ఇది పెరుగుతోందని చెప్పారు. అదే సమయంలో జీఎస్‌డీపీ, సొంత పన్నుల ఆదాయంతో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం క్రమంగా తెలంగాణలో తగ్గుతోందని సీఎం రేవంత్, అధికారులకు అరవింద్ సుబ్రమణియన్ వివరించారు.


