12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్‌! ఐతే.. | this woman performed a c section on herself and saved her babys life | Sakshi
Sakshi News home page

12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్‌! ఐతే..

Aug 7 2026 6:23 PM | Updated on Aug 7 2026 6:34 PM

this woman performed a c section on herself and saved her babys life

ప్రసవ వేదన అంటేనే భరించలేని నరకం అంటారు. ఇంకో జన్మఎత్తడం లాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాంటిది అంతటి ఉద్విగ్న స్థితిలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం తనకు తానుగా సిజేరియన్‌​ చేసుకుని ప్రసవించింది. వైద్యలు సైతం విస్తుపోయారు. ఒకవేళ అలా చేసినా తల్లీబిడ్డ బతకడం అసాధ్యమని అన్నారు.

ఈ మిరాకిల్‌ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలోని ఓక్సాకాలో ఒక మారుమూల పర్వత గ్రామంలో ఇనెస్‌ రామిరేజ్‌ పెరెజ్‌ అనే మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. అందుకు కారణం ఆమె ఉన్న పరిస్థితులనే చెప్పాలి. నిజానికి ఆమె నిండు గర్భిణీ. ప్రసవించే సమయం దగ్గరపడుతున్న తరుణం. 

కానీ ఇంట్లో కనీసం కరెంట్‌ లేదు, ఫోన్‌ లేదు, నీటి సరఫరా కూడా లేదు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేని ఓ మారమూల పర్వత గ్రామంలో ఉంటుందామె. ఆ టైంలో ఇంట్లో ఆమె భర్త కూడా లేడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అలా ఆమె మొత్తం 12 గంటలు నొప్పులతో నరకం చూసింది. ఇక చూస్తుండగానే తనకు, తన బిడ్డకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గ్రహించి తనకు తానుగా సీజేరియన్‌ చేసుకునేందుకు సిద్దమైంది. 

ఎందుకంటే అంతకుమునుపు కూడా ఇలానే ప్రసవవేదన పడి పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఆ వేదన ఆమెకు తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాహసానికి పూనుకుందామె. అందుకోసం ముందుగా తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ఉండేలా కాస్త మద్యం సేవించింది. ఆ తర్వాత తన గర్భాశయం వద్ద ఇంట్లో ఉండే కత్తితో కోసి బిడ్డను బయటకు తీసింది. బొడ్డు తాడుని కత్తెరతో కట్‌చేసి స్పృహ తప్పి పడిపోయింది. 

ఆ తర్వాత కొద్దిసేపటికే మెలుకువ వచ్చాక..తనకు అందుబాటులో ఉన్న వాటితో గాయానికి చక్కగా కట్టు కట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకుని పిలిచి గ్రామంలోని డాక్టర్‌కి విషయం చెప్పమని పంపింది. ఆ తర్వాత ఆ గ్రామ వైద్యుడు వచ్చి ఆమెను హుటాహుటినా క్లినిక్‌కి తీసుకువెళ్లి..కట్లు వేశాడు. అలాగే తల్లీబిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్‌ కలగకుండా తగిన చికిత్స కూడా అందించాడు. అయితే ఇక్కడ వైద్యులు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైందని విస్తుపోయారు.  

అసలు స్వీయంగా సీజేరియన్‌ అంటే మాటలు కాదు..ఒకవేళ అలా చేసినా, బతికే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఎందుకంటే తగిన పనిముట్లు, అనుభవం గానీ లేని మహిళ తనకు అందుబాటులో ఉన్నవాటితో ప్రసవం చేసుకోవడం, బతికి బట్టగట్టగలగడం అంటే ఇదోక మిరాకిల్‌ అని అన్నారు వైద్యులు. ఈ అద్భుతమైన ఘటన మార్చి 05, 2000లలో చోటు చేసుకుంది. 

అలాగే ఇలాంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించే సాహసం చేయొద్దని హెచ్చరించారు వైద్యులు . ఇక్కడ ఆ మహిళకు మరో గత్యంతర లేక, బిడ్డను కాపాడుకోవడానికి మాతృమూర్తి చేసిన సాహస కృత్యంగా పరిగణించాలని అన్నారు గైనకాలజిస్ట్‌లు. అయినా ఇంకా కరెంట్‌ రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు ఉన్నాయా అనే అంశాన్ని లేవనెత్తడమే గాక, అలాంటి చోట్ల ఉండే గర్భిణుల సంరక్షణ ప్రాముఖ్యతను హైలెట్‌ చేసింది. అలాగే వ్యవస్థలోనే లోపాలను ఎత్తి చూపిన ఘటనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.

(చదవండి: బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్‌ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement