breaking news
Mother and baby
-
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.పసిపాప ఆరోగ్యానికి అమృతంతల్లిపాలలోని యాంటీబాడీలు చిన్నతనంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం.బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.తల్లి సరైన పోషకాహారం, సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.అవసరమైనప్పుడు ప్రత్యేక పంప్ సహాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు.పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్యఉండే స్పర్శ వల్ల మానసిక బంధం మరింత బలపడుతుంది.వీలైనంత వరకు పాలు తాగించే సీసాలు, పాసిఫైయర్స్ వాడకపోవడమే మంచిది.ప్రతి మూడు గంటలకు ఒకసారి సీసాలోకి పాలు పోసి పాలు ఇవ్వవచ్చు. -
12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్! ఐతే..
ప్రసవ వేదన అంటేనే భరించలేని నరకం అంటారు. ఇంకో జన్మఎత్తడం లాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాంటిది అంతటి ఉద్విగ్న స్థితిలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం తనకు తానుగా సిజేరియన్ చేసుకుని ప్రసవించింది. వైద్యలు సైతం విస్తుపోయారు. ఒకవేళ అలా చేసినా తల్లీబిడ్డ బతకడం అసాధ్యమని అన్నారు.ఈ మిరాకిల్ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలోని ఓక్సాకాలో ఒక మారుమూల పర్వత గ్రామంలో ఇనెస్ రామిరేజ్ పెరెజ్ అనే మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. అందుకు కారణం ఆమె ఉన్న పరిస్థితులనే చెప్పాలి. నిజానికి ఆమె నిండు గర్భిణీ. ప్రసవించే సమయం దగ్గరపడుతున్న తరుణం. కానీ ఇంట్లో కనీసం కరెంట్ లేదు, ఫోన్ లేదు, నీటి సరఫరా కూడా లేదు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేని ఓ మారమూల పర్వత గ్రామంలో ఉంటుందామె. ఆ టైంలో ఇంట్లో ఆమె భర్త కూడా లేడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అలా ఆమె మొత్తం 12 గంటలు నొప్పులతో నరకం చూసింది. ఇక చూస్తుండగానే తనకు, తన బిడ్డకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గ్రహించి తనకు తానుగా సీజేరియన్ చేసుకునేందుకు సిద్దమైంది. ఎందుకంటే అంతకుమునుపు కూడా ఇలానే ప్రసవవేదన పడి పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఆ వేదన ఆమెకు తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాహసానికి పూనుకుందామె. అందుకోసం ముందుగా తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ఉండేలా కాస్త మద్యం సేవించింది. ఆ తర్వాత తన గర్భాశయం వద్ద ఇంట్లో ఉండే కత్తితో కోసి బిడ్డను బయటకు తీసింది. బొడ్డు తాడుని కత్తెరతో కట్‌చేసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మెలుకువ వచ్చాక..తనకు అందుబాటులో ఉన్న వాటితో గాయానికి చక్కగా కట్టు కట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకుని పిలిచి గ్రామంలోని డాక్టర్‌కి విషయం చెప్పమని పంపింది. ఆ తర్వాత ఆ గ్రామ వైద్యుడు వచ్చి ఆమెను హుటాహుటినా క్లినిక్‌కి తీసుకువెళ్లి..కట్లు వేశాడు. అలాగే తల్లీబిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా తగిన చికిత్స కూడా అందించాడు. అయితే ఇక్కడ వైద్యులు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైందని విస్తుపోయారు. అసలు స్వీయంగా సీజేరియన్ అంటే మాటలు కాదు..ఒకవేళ అలా చేసినా, బతికే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఎందుకంటే తగిన పనిముట్లు, అనుభవం గానీ లేని మహిళ తనకు అందుబాటులో ఉన్నవాటితో ప్రసవం చేసుకోవడం, బతికి బట్టగట్టగలగడం అంటే ఇదోక మిరాకిల్ అని అన్నారు వైద్యులు. ఈ అద్భుతమైన ఘటన మార్చి 05, 2000లలో చోటు చేసుకుంది. అలాగే ఇలాంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించే సాహసం చేయొద్దని హెచ్చరించారు వైద్యులు . ఇక్కడ ఆ మహిళకు మరో గత్యంతర లేక, బిడ్డను కాపాడుకోవడానికి మాతృమూర్తి చేసిన సాహస కృత్యంగా పరిగణించాలని అన్నారు గైనకాలజిస్ట్లు. అయినా ఇంకా కరెంట్ రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు ఉన్నాయా అనే అంశాన్ని లేవనెత్తడమే గాక, అలాంటి చోట్ల ఉండే గర్భిణుల సంరక్షణ ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే వ్యవస్థలోనే లోపాలను ఎత్తి చూపిన ఘటనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.(చదవండి: బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!) -
బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది...
తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే ఆనందం మాత్రమే కాదు అదే సమయంలో స్త్రీ తల్లిగా కొత్త జన్మ ఎత్తుతుందని, ఆ జన్మను మరింత దివ్యంగా మార్చుకునే శక్తి ఆమెకే ఉందని ప్రపంచస్థాయిలో ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లికి కుటుంబ మద్దతు, వైద్యుల సూచనలు తప్పనిసరి అవసరం...ఔషధం లాంటి అమ్మపాలు బిడ్డకు అమృతమే. సహజ పోషకాహారం. బిడ్డ ఆరోగ్యకరమైన భావి జీవితానికి ఎంతో విలువైనవి. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో పాటు పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మపాల ్రపాధాన్యత గురించి, బిడ్డకు లభించిన జన్మహక్కు గురించి మరింత వివరంగా తెలుసుకోవడం, తెలియజెప్పడం మన విధి.ఇన్ఫెక్షన్ల నివారిణి...తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలావరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్కా అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శక్తి ప్రదాయిని. సాధారణ సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలొస్ట్రమ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలని, ‘మొదటి గంట’ మరీ కీలకం అని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఇంతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి కారణం శిశువు ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఆ పాలలో ఉంటాయి. ్ర΄÷టీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.తల్లి పాలు ఇవ్వడం ద్వారా... శిశువులోనూ, తల్లిలోనూ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మాతా – శిశు మరణాల రేటు తగ్గించవచ్చు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మేధో పరీక్షలలో మెరుగ్గా రాణిస్తారు. అధికబరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ ∙తల్లిపాలు ఇచ్చే మహిళలకు రొమ్ము, అండాశయ కాన్సర్ల ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. తల్లిపాల పెంపుదలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తల్లిపాలు అందక ఇప్పటికీ ప్రతి వెయ్యి నవజాత శిశువులలో 224 నుంచి 263 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నేటికీ 6 నెలల లోపు శిశువులలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.పని ప్రదేశాలలో తల్లిపాలకు మద్దతుపిల్లల జీవితంలో ఆరోగ్యకరమైన పునాది వేసేది తల్లిపాలు. శిశు, చిన్న పిల్లల పోషణలో అవగాహన మాత్రమే తల్లిపాలు ఇచ్చే శాతాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సంస్థ 16 అధ్యయనాల అంచనాలను క్రోడీకరించి ఆరోగ్య కేంద్రాలు, సంఘాలు, ఇళ్లలో చెప్పడం ద్వారా తల్లిపాలు ఇచ్చే రేటు 58 శాతం పెరిగిందని వివరించింది. ∙15,096 మంది నవజాత శిశువులపై జరిపిన అధ్యయనాలలో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్‌హెచ్‌ఐ) వల్ల శిశువు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చేవారి సంఖ్యలో 45 శాతం పెరిగిందని, ఆ తర్వాత కొనసాగించేవారి సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగిందని వివరించింది ∙మీడియా జోక్యం ద్వారా 17 శాతం తల్లిపాలు పట్టడాన్ని పెంచిందని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది ∙వేతనంతో కూడిన ప్రసూతి సెలవు వల్ల తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తేలింది. పని ప్రదేశంలో శిశువులకు తల్లిపాలు పట్టడానికి మద్దతు ఇచ్చే విధానాలు, కార్యక్రమాలు తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అభి్రపాయపడింది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
క్షణికావేశం.. తీరని శోకం
రహమత్‌నగర్: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తాను లేని బతుకు పిల్లలకు ఎందుకనుందోగానీ ముక్కుపచ్చలారని చిన్న పిల్లల గొంతు నులిమేసింది. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా పాప మృత్యువుతో పోరాడుతోంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంకు చెందిన మురళివేణుకు మందమర్రికి చెందిన సత్యవాణి (33)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రుద్రాన్‡్ష (5), తన్విక(2) పిల్లలున్నారు. ప్రైవేటు పనులు చేసుకునే మురళి వేణు తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో బోరబండ డివిజన్లోని పెద్దమ్మగుడి నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మురళివేణు తండ్రికి కిడ్నీలు పాడైపోవడంతో రెండు రోజులకుకోమారు డయాలసిస్ చేయిస్తుంటాడు.తల్లి హౌస్ కీపింగ్ పనికి వెళ్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మురళివేణుకు ట్రాన్స్‌కో జూనియర్ లైన్మెన్గా ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. గత కొన్ని రోజులుగా సత్యవాణి, మురళిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తనతో, పిల్లలతో గడపడం లేదంటూ, బయట పనులే ఎక్కువయ్యాయని ఇంట్లో గొడవ పడేవారని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పెళ్లి రోజైన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన సత్యవాణి తన పిల్లలు రుద్రాన్‡్ష, తన్వికల గొంతు నులిమేసింది. వారు చనిపోయారని భావించాక తానూ ఉరి వేసుకుని బలవర్మణం చెందింది.ఆమె అత్త హౌస్ కీపింగ్ పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక గమనించి 100 డయల్‌కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి సత్యవతి, కొడుకు రుద్రాన్‡్ష మృతి చెందారు. కూతురు తన్విక కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరి«స్థితి విషమంగా ఉందని సమాచారం. బోరబండ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్.. వైరల్
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్ మదర్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది. మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్లుకాస్లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్వుడ్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు) ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్వుడ్ తన ఫేస్బుక్లో ఈ వివరాలను పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ మియామీలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. (మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్) -
మాతాశిశువుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
లోదొడ్డి(రాజవొమ్మంగి) : లోతట్టు గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను అరికట్టి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ గిరిజనులకు హామీ ఇచ్చారు. బుధవారం మాతాశిశు సంక్షేమం కోసం మండంలోని జడ్డంగి, లోదొడ్డి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె ప్రారంభించారు. లోదొడ్డి పరిసర ప్రాంతాల్లో గర్భిణులు ఆస్పత్రులకు చేరేలోగా చనిపోతున్నారని తెలియడంతో ఆమె చలించిపోయారు. లోదొడ్డి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. సుమారు గంటన్నరపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్‌కు సమస్యల ఏకరువు దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తమ గ్రామానికి జిల్లాకలెక్టర్ రావడంతో స్థానికులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం వారు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. మంచం పట్టిన రోగిని దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించేందుకు అవస్థలు పడతున్నామని, తీరా రోగి పరిస్థితి విషమిస్తే మృతదేహం తిరిగి ఇంటికి తెచ్చుకొనేందుకు కష్టాలు పడుతున్నామని గిరిజనులు కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ లోదొడ్డి గ్రామానికి రవాణా అవసరాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేయాలని రంపచోడవరం పీఓ గంధం చంద్రుడిని కోరారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఐదు నెలలో పూర్తి స్థాయి బీటీరోడ్ రూపొందించాలని సూచించారు. వాతంగి సబ్‌సెంటర్, గర్భిణుల వసతి గృహం ఏర్పాటుకు రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గర్భిణుల కోసం జడ్డంగి పీహెచ్సీలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ పద్మావతిని ఆదేశించారు. ప్రతి గిరిజన మహిళను పలుకరించి వారి సమస్యలను అడిగితెలుసుకొన్నారు.లోదొడ్డి వైద్య శిబిరానికి హాజరైన వాతంగి గ్రామానికి చెందిన గర్భిణి మంప రాఘవ హైరిస్క్ (రక్తహీనతతో బాధపడుతూ) కాన్పు కష్టం కావచ్చని జిల్లా కలెక్టర్ గమనించారు. ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా కాకినాడ వచ్చే రోగుల కోసం ప్రత్యేక బర్త్ వెయిటింగ్ రూం ను వెంటనే ఏర్పాటుచేయాలని రంపచోడవరం ఏడీఎంహెచ్ఓ పవన్ కుమార్ ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జడ్డంగి, లోదొడ్డి, వాతంగి సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, లోతా రామారావు, జుర్రా జాన్, వైఎస్సార్ సీపీ నేతలు గవాస్కర్, అర్జున్, తిమోతి, ఎంపీపీ కలింకోట నూకరత్నం, వైస్ ఎంపీపీ దంతులూరి శివరామచంద్ర రాజు, వ్యవసాయపరపతి సంఘం అధ్యక్షుడు గణజాల తాతారావు, ఆర్డీఓ శంకర వర ప్రసాద్, సీడీపీఓ రాజ్యలక్ష్మి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఈఈ పీకే. నాగేశ్వరరావు, డీఈ హరికృష్ణ, ఏలేశ్వరం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ మహేశ్వరరావు హాజరయ్యారు.


