డ్రగ్స్‌ నిరోధక ‘ఈగల్’‌లో ఇంటి దొంగలు.. 50 లక్షల విలువైన.. | Two Eagle Squad Cops Accused of Peddling 50 Lakh Ecstasy In Telangana | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిరోధక ‘ఈగల్’‌లో ఇంటి దొంగలు.. 50 లక్షల విలువైన..

Aug 24 2026 8:58 AM | Updated on Aug 24 2026 9:16 AM

Two Eagle Squad Cops Accused of Peddling 50 Lakh Ecstasy In Telangana

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఈగల్‌ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్‌ దందాకు ప్రయత్నించిన వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ పెడ్లర్లను పట్టుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఏకంగా డ్రగ్స్‌ విక్రయానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. తెలంగాణలో డ్రగ్స్‌ పెడ్లర్‌ను పట్టుకునేందుకు ఈగల్‌ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌ సమయంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్‌ నరహరి, స్వామి వ్యవహారం బయటపడినట్లు సమాచారం. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన కిలో ఎక్స్టసీ మాత్రలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మాత్రలను వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ పెడ్లర్ల కదలికలు, వారి ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలపై ఈగల్‌ శాఖ సేకరించిన నిఘా సమాచారాన్ని కానిస్టేబుళ్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమాచారంతో డ్రగ్స్‌ పెడ్లర్లను సంప్రదించి, తమ వద్ద ఉన్న ఎక్స్టసీ మాత్రలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

చదవండి: జైలుకు వె‍ళ్లొచ్చిన సురేఖ.. విషాదంతం

అంటే డ్రగ్స్‌ ముఠాలను గుర్తించేందుకు పోలీసులకు అందుబాటులో ఉన్న కీలక నిఘా వ్యవస్థనే సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరహరి, స్వామి గతంలో పలు యాంటీ డ్రగ్స్‌ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచినందుకు అవార్డులు కూడా పొందినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ నిర్మూలన కోసం పనిచేసే విభాగంలోనే కీలక బాధ్యతలు నిర్వహించిన సిబ్బందిపై ఇప్పుడు డ్రగ్స్‌ విక్రయానికి ప్రయత్నించారనే ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది.

అంతర్గత విచారణ ప్రారంభం..
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఈగల్‌ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. వారి వద్దకు ఎక్స్టసీ మాత్రలు ఎలా వచ్చాయి, డ్రగ్స్‌ పెడ్లర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిఘా డేటాను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా సిబ్బంది లేదా డ్రగ్స్‌ ముఠా సభ్యుల ప్రమేయం ఉందా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కానిస్టేబుళ్ల ఫోన్‌ కాల్స్‌, డ్రగ్స్‌ పెడ్లర్లతో వారి పరిచయాలు, నిఘా డేటా వినియోగం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement