న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, వాఘా-అటారీ సరిహద్దు మూసివేత తదితర పరిణామాల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వివాహాలు వాయిదా పడిన 150 మందికి పైగా పాకిస్థానీ సింధీ వధువులు ఎట్టకేలకు తమ పెళ్లిళ్ల కోసం భారత్ చేరుకున్నారు. భారత యువకులతో నిశ్చితార్థం చేసుకున్న వీరు, నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా విమాన మార్గంలో దేశంలోకి అడుగుపెట్టారు.
సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వీరికి, వారి బంధువులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక షరతులతో కూడిన వీసాలు జారీ చేసిందని కమ్యూనిటీ నేత రాజేష్ ఝంబియా ఆదివారం తెలిపారు. ‘వారి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వధువులు, దాదాపు 450 మంది బంధువులు మస్కట్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల మీదుగా కనెక్టింగ్ విమానాల ద్వారా మాత్రమే భారత్ చేరుకోవాలని కేంద్రం నిబంధన విధించింది’ అని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.
గతంలో వాఘా-అటారీ సరిహద్దు గుండా వీసా ప్రక్రియ, ప్రయాణాలు సులభంగా ఉండటంతో పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కుటుంబాలు భారతీయులతో వివాహ సంబంధాలు కుదుర్చుకునేవి. అయితే జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భారీ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, వాఘా-అటారీ సరిహద్దును మూసివేసింది. దీంతో నాగ్‌పూర్, రాయ్‌పూర్, జోధ్‌పూర్, పుణె తదితర నగరాల్లో జరగాల్సిన సుమారు 150 వివాహాలు నిలిచిపోయాయని ఝంబియా వివరించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ ఘోట్కిలోని ప్రసిద్ధ హిందూ మత క్షేత్రమైన షాదానీ దర్బార్ అధిపతి సంత్ యుధిష్ఠిర్‌లాల్ షాదానీని ఆశ్రయించాయి. ఆలయ యాజమాన్యం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను (ఎంహెచ్‌ఏ) అభ్యర్థించడంతో, ప్రత్యేక విమాన ప్రయాణ షరతులతో కూడిన వీసాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 150 మంది వధువులు భారత్ చేరుకున్నారని, ఇందులో 15 మంది నాగ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారని ఝంబియా పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 300 మంది పాకిస్థానీ సింధీ మహిళలు సైతం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి


