పాట్నా: బీహార్ రాజకీయాల్లో వారసత్వ చర్చకు తెరలేచిందా? ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ.. ఆయన కుమారుడు, ఆరోగ్య మంత్రి నిషాంత్ కుమార్ పేరు సీఎం రేసులో వినిపించడం ఆసక్తికరంగా మారింది. నిషాంత్ భవిష్యత్తులో బీహార్ ముఖ్యమంత్రి కావాలని జేడీయూ సీనియర్ నేత దేవేశ్ చంద్ర ఠాకూర్ బహిరంగంగా ఆకాంక్షించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీతామఢీ పర్యటన సందర్భంగా నిషాంత్ కుమార్‌కు జేడీయూ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నిషాంత్‌ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా చూస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. జేడీయూ సీనియర్ నేత దేవేశ్ చంద్ర ఠాకూర్ స్పందిస్తూ.. “ఎందుకు కాదు? రాజకీయాలు సాధ్యాసాధ్యాల కళ. ఆయన అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ బీహార్‌కు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారని, ఆయన అడుగుజాడల్లో నిషాంత్ కుమార్ కూడా నడిచి ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఠాకూర్ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి వచ్చిన నిషాంత్ కుమార్ ప్రస్తుతం బీహార్ ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్నారు. తొలుత కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించిన ఆయన.. జేడీయూ నేతలు, కార్యకర్తల ఒత్తిడితో కేబినెట్‌లో చేరినట్లు సమాచారం. అయితే, నిషాంత్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైందని, ఆయన పనితీరును అంచనా వేయడానికి ఇది చాలా తొందరని ఠాకూర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రజల అంచనాలను అందుకుంటూ తండ్రి నితీశ్ కుమార్ మాదిరిగా అన్ని వర్గాల కోసం పనిచేస్తానని నిషాంత్ తెలిపారు. మొత్తానికి జేడీయూ సీనియర్ నేత చేసిన ఈ వ్యాఖ్యలతో.. నితీశ్ తర్వాత బీహార్ పగ్గాలు నిషాంత్ చేతుల్లోకి వెళ్లే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: ‘జనగణమన’ మధ్యలోనే వెళ్లిపోయిన స్పీకర్


