సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది.
అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ రియాక్షన్
ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.


