సమస్యలు ‘శాకో’పశాఖలు! | Vegetable cultivation area decreasing in the state | Sakshi
Sakshi News home page

సమస్యలు ‘శాకో’పశాఖలు!

Aug 24 2026 5:33 AM | Updated on Aug 24 2026 5:33 AM

Vegetable cultivation area decreasing in the state

రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం

రాష్ట్రానికి ఏటా 56.21 లక్షల టన్నుల అవసరం.. 

పండుతున్నది 11.17 లక్షల టన్నులే

నిత్యం కూరగాయలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్న తెలంగాణ

కాయగూరలకు అంతంత మాత్రంగానే మార్కెటింగ్‌ సౌకర్యాలు 

ఓవైపు స్టోరేజీ కొరత...మరోవైపు కోతులు, అడవి పందుల బెడద 

సాక్షి, హైదరాబాద్‌: ఏటేటా రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గుతోంది. తెలంగాణ ఉద్యానశాఖ గణాంకాలను పరిశీలిస్తే.. 2022–23లో రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగై 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైతే, 202–24 నాటికి కూరగాయల విస్తీర్ణం 1.13 లక్షల ఎకరాలకు పడిపోయి, ఉత్పత్తి 11.17 లక్షల టన్నులకు తగ్గింది. అంటే ఒక్క ఏడాదిలోనే సాగు విస్తీర్ణం సుమారు 22 వేల ఎకరాలు తగ్గగా.. ఉత్పత్తి 3.47 లక్షల టన్నులు పడిపోయింది. 

ఇక 2025–26కు సంబంధించిన తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదికలో కూరగాయల సాగు విస్తీర్ణం 1.03 లక్షల ఎకరాలుగా ఉంది. అదే సమయంలో ఉత్పత్తి 9.53 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే మూడేళ్లలో కూరగాయల పంటల ఉత్పత్తి ఏకంగా 35 శాతం పడిపోయింది. రాష్ట్రంలో వరి సాగుకు నీటివసతి, కొనుగోలు వ్యవస్థ, కనీస మద్దతు ధర, మార్కెట్‌ భరోసా వంటి అంశాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. 2025–26లో రాష్ట్ర వరి ఉత్పత్తి 187.19 లక్షల టన్నులుగా అంచనా వేయగా.. 2024–25లో ఇది 189.45 లక్షల టన్నులుగా నమోదైంది. 

భారీ లోటులో ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, బంగాళాదుంప 
రాష్ట్రానికి అవసర మైన కూరగాయల్లో నిత్యం వినియోగించే ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపల ఉత్పత్తి లోటు భారీగా ఉంది. రాష్ట్రంలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల పంటల జాడ కూడా లేకుండా పోయింది. ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఏకంగా 3.77 లక్షల టన్నుల లోటు ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం–ఐకార్‌ కూరగాయల పరిశోధన వ్యవస్థ ఆధారంగా జరిగిన విశ్లేషణ వెల్లడించింది. ఈ లోటును పూడ్చాలంటే అదనంగా 44,549 ఎకరాలను కేవలం ఉల్లిపాయల సాగులోకి తేవాల్సి ఉంటుంది. ఆకుకూరల్లో 2.77 లక్షల టన్నుల లోటు ఉండగా, ఇందుకోసం మరో 59,045 ఎకరాలు అవసరం. 

బంగాళాదుంపలో 2.15 లక్షల టన్నుల కొరత ఉండగా, అదనంగా 26,806 ఎకరాలు సాగు చేయాల్సి ఉంటుందని అంచనా. అంటే రాష్ట్రంలో స్వయం సమృద్ధికి మరో 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు అవసరం. ఆ దిశగా సాగు లక్ష్యాలు నిర్ధేశించుకున్నా, రైతులు ముందుకు రావడం లేదు. కూరగాయల సరఫరాలో డిమాండ్‌– సప్లై చైన్‌ విషయంలో అంతరం ఏర్పడుతోంది. టమాటాకు మే–ఆగస్టు, ఉల్లికి జూలై–అక్టోబర్‌/నవంబర్, ఆకుకూరలకు జనవరి–ఆగస్టు, బంగాళాదుంపకు మే–డిసెంబర్‌ మధ్య కొరత అధికంగా కనిపిస్తోంది.

ముందుకు రాని రైతులు
తెలంగాణ ఉద్యానశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల వరకు ఉద్యాన పంటలు సాగు చేయవచ్చని పేర్కొంది. ప్రతి రూపాయి పెట్టుబడికి ఉద్యాన పంటల నుంచి సగటున రూ.3.5 లక్షల రాబడి, సాధారణ వ్యవసాయ పంటల నుంచి రూ.1.5 లక్షల రాబడి ఉంటుందని తెలిపింది. బోర్ల కింద అధిక నీరు అవసరమయ్యే వరి స్థానంలో, మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న కూరగాయలను శాస్త్రీయంగా ప్రోత్సహించాలన్నదే శాస్త్రవేత్తల సూచన. అయినా రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో కూడా కనీసం ఆశించిన స్థాయిలో కూడా కూరగాయల సాగు సాగలేదు.  

సవాలక్ష సమస్యలు.. 
రైతులు కూరగాయల సాగు చేయాలన్నా సవాలక్ష సమస్యలు ఉన్నాయి. వసతుల కల్పన, రైతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న వాదన వినవస్తోంది. కూరగాయల సాగులో ధరల హెచ్చుతగ్గులు, పంట నష్టం, నిల్వ సదుపాయాల కొరత, మార్కెటింగ్‌ సమస్యలు, పురుగు–తెగుళ్లు రైతులను వెనక్కి నెడుతున్నాయి. పైగా కోతులు, అడవి పందుల బెడద కూడా తీవ్రంగా ఉంది. 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కూరగాయల సదస్సులో నిపుణులు కూడా వాతావరణ మార్పులు, పురుగు–తెగుళ్లు, కోత అనంతర నష్టాలు, పరిమిత ప్రాసెసింగ్‌ సదుపాయాలు కూరగాయల ఉత్పత్తి పెరగకపోవడానికి ప్రధాన కారణాలని పేర్కొనడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement