ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ విషయం
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఘటన
పాలమూరు: నెలరోజుల చిన్నారి తొడలో సూది (నీడిల్) దిగిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది. సుమారు 20 రోజులుగా పాప నొప్పితో బాధపడుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే చేయించడంతో తొడలో సూది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిందా? లేక టీకా వేసే సమయంలో చోటుచేసుకుందా? అన్నది తేలాల్సి ఉంది. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన వెంకట్‌రాములు భార్య అక్షిత జూలై 19న ప్రసవం కోసం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది.
మరుసటి రోజు సాధారణ ప్రసవంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పాప పసిరికలతో అస్వస్థతకు గురికావడంతో ఎస్‌ఎన్‌సీయూలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో పాప తొడ భాగంలో వాపు కనిపించింది. దీనిపై తల్లి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల వాపు వచ్చిందని, రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పి పంపించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా వాపు తగ్గకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ఎక్స్‌రే తీయగా.. పాప తొడలో సూది ఉన్నట్లు గుర్తించారు.
దీంతో తల్లిదండ్రులు పాపను తిరిగి మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి జనరల్ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూలో చేర్పించారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరాను వివరణ కోరగా.. పాప తొడలోకి సూది ఎలా వెళ్లిందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదని, సోమవారం పాపను పరీక్షించి శస్త్రచికిత్స ద్వారా సూదిని తొలగిస్తామని తెలిపారు. పాపకు యాంటీబయాటిక్స్ ఇచ్చే క్రమంలో ఈ ఘటన జరిగిందా? లేక బయట టీకా వేసిన సమయంలో చోటుచేసుకుందా? అన్నది పరిశీలిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.


