తిరువనంతపురం: కుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియా ద్వారా విశేష గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో కేరళలోని ఒక ఆలయంలో ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రమోట్ చేస్తూ, అభిమానుల మద్దతు తనకు ఎంతో అవసరమని, ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
యూట్యూబ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మోనాలిసా ఐకాన్ అఫీషియల్’ (Monalisa Icon Official) పేరిట ఉన్న ఈ ఛానెల్‌లో మ్యూజిక్ వీడియోలు, షూటింగ్ సన్నివేశాలు, వ్లాగ్స్ ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 425 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు, 21 వేలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. కాగా, వివాహం అనంతరం ఈ జంట తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ‘లవ్ జిహాద్’ ఆరోపణలతో పాటు, మోనాలిసా మైనర్ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాము మేజర్లమేనంటూ మీడియా సమక్షంలో పత్రాలు చూపించినప్పటికీ, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ విచారణలో ఆమె మైనర్ అని తేలింది. మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు నిర్ధారణ కావడంతో, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే తన అధికారిక పుట్టిన తేదీ నమోదు తప్పుగా ఉందని, తన అసలు పుట్టిన తేదీ 2008 జనవరి 1 అని పేర్కొంటూ మోనాలిసా ఇండోర్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తూ ప్రాణహాని కలిగిస్తున్నారని ఆరోపించడంతో, కేరళ హైకోర్టు ఆమెకు ఇటీవల పోలీస్ రక్షణ కల్పించింది.
ఇది కూడా చదవండి: పోలీసులపై మూకదాడి: కళ్లలో కారం కొట్టి..


