ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!
స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట.
ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..
నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.
ఎవరీ మార్టిన్ డే..
55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్‌గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్‌గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్‌బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.
2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్‌గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.
ఎవరీ నిధిన్ చందన్..
ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.
అలా పరిచయమైంది..
యూకేలో ఆమె పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్‌లిత్‌గో అండ్ ఈస్ట్ ఫాల్‌కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.
మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్‌తో కలిసి యూకే వెళ్ళాడు.
అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్‌బర్గ్‌లోని కంప్యూటర్‌షేర్‌లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్‌లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
(చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!)


