breaking news
Scottish man
-
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం!
ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.ఎవరీ మార్టిన్ డే..55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్‌బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.ఎవరీ నిధిన్ చందన్..ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.అలా పరిచయమైంది..యూకేలో ఆమె పీహెచ్డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్లిత్గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్తో కలిసి యూకే వెళ్ళాడు.అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్‌బర్గ్‌లోని కంప్యూటర్షేర్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by jith (@jith__uday) (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
డగ్లస్ స్టువార్ట్‌కు బుకర్ ప్రైజ్
లండన్: న్యూయార్క్‌కు చెందిన స్కాటిష్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్ ప్రైజ్‌ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ అనంతరం డగ్లస్ న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు. (చదవండి: జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు) -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
వందల కోట్ల లాటరీ..
ఏదైనా వస్తువు కనబడకుండా పోయి.. తిరిగి దొరికితే మనంత అదృష్టవంతులు లేరనుకుంటాం. అదే వందల కోట్ల లాటరీ తగిలి.. ఆ టికెట్ పోయి.. తర్వాత దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా.. అలాంటి అద్భుతమే జరిగింది స్కాట్లాండ్లో. అబెర్డీన్ షైర్‌కు చెందిన దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్లు ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్‌ను కొనుక్కున్నారు. డ్రాలో తమ నంబర్ వచ్చిందో లేదోనని కనుక్కునేందుకు స్థానికంగా ఉండే లాటరీ కార్యాలయా నికి వెళ్లారు. అయితే లాటరీ వారికి రాలేదని ఆ టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. సిబ్బంది సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అతడి నంబర్‌ను ఎలాగోలా కనుక్కొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తీసిన డ్రాలో హిగిన్స్ నంబర్ ఉందని తేలింది. దీంతో చెత్తబుట్టను మొత్తం వెతికించి అతడి టికెట్‌ను తిరిగిచ్చేశారు. ఇంతకీ ఆ టికెట్‌కు తగిలిన లాటరీ మొత్తం ఎంతో తెలుసా..! అక్షరాలా రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. -
ఆకాశంలో విమానం డోర్ తెరవబోయి..
లండన్: కేఎల్ఎమ్ విమానం ఎడిన్బర్గ్ నుంచి ఆమ్స్టర్డామ్కు బయల్దేరింది. సముద్ర మట్టానికి 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో స్కాట్లాండ్కు చెందిన జేమ్స్ గ్రే అనే ప్రయాణికుడు విమానం డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అవాక్కయ్యారు. అతన్ని మార్గమధ్యంలోనే విమానంలో నుంచి దించేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో జేమ్స్‌ను అరెస్ట్ చేశారు. జేమ్స్‌కు దాదాపు 45 వేల రూపాయలు జరిమానా విధించారు. దీంతో పాటు ఐదేళ్ల పాటు కేఎల్ఎమ్ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు. అయితే జేమ్స్ మాత్రం విమానం డోర్ తెరవలేదని చెప్పాడు. టాయ్‌లెట్ డోర్ అనుకుని పొరపాటుగా విమానం డోర్‌ను కేవలం తాకానని అన్నాడు. తాను ప్రయాణించేందుకు కేఎల్ఎమ్ సిబ్బంది అంగీకరించలేదని, స్నేహితుడి సాయంతో మరో విమానంలో ఆమ్స్టర్డామ్ చేరుకున్నానని చెప్పాడు.


