‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు.. కానీ కేరళ బీజేపీ పరిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 45 ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించి తిరువనంతపురం కార్పొరేషన్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీకి.. గెలిచిన కొన్ని నెలల్లోనే సొంత పార్టీ నేత నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ డీజీపీ, కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
తిరువనంతపురం కార్పొరేషన్‌లోని శాస్తమంగళం వార్డు నుంచి బీజేపీ తరఫున శ్రీలేఖ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు నుంచే ఆమెను పార్టీ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. పార్టీ నాయకత్వం కూడా తనను తిరువనంతపురంలో బీజేపీ ముఖంగా నిలబెడతామని, మేయర్ పదవికి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీలేఖ గతంలో వెల్లడించారు. అయితే బీజేపీ చివరకు వీవీ రాజేశ్‌ను మేయర్‌గా ఎంపిక చేసింది. దీంతో శ్రీలేఖ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. మొదట్లోనే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదని, పార్టీ నేతలు పలుమార్లు కోరడంతోనే బరిలోకి దిగినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..
మేయర్ పదవి దక్కకపోయినా పార్టీ నిర్ణయాన్ని అంగీకరించినట్లు గతంలో శ్రీలేఖ ప్రకటించారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేశారని, వారి కోసం కౌన్సిలర్‌గా కొనసాగుతానని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను మేయర్ వీవీ రాజేశ్‌కు అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు కూడా కాపీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే కార్పొరేషన్ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించిన తర్వాతే అది అధికారికంగా అమల్లోకి వస్తుంది.

బీజేపీకి మరో చిక్కు..
తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ 50 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 29, కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిచాయి. మొత్తం 101 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో మ్యాజిక్ ఫిగర్ 51. దీంతో బీజేపీకి ఒక్క సీటు తక్కువగా ఉంది. ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో బీజేపీ పాలన ఏర్పాటు చేసింది. ఇలాంటి సమయంలో శ్రీలేఖ రాజీనామా చేయడం ‘గెలుపు ఇంట్లోనే గొడవ మొదలైనట్లే’ అన్న పరిస్థితిని తలపిస్తోంది. ఆమె రాజీనామా అధికారికమైతే బీజేపీ బలం మరింత తగ్గుతుంది. దీంతో కార్పొరేషన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం పార్టీకి మరింత సవాలుగా మారే అవకాశం ఉంది.
బుజ్జగింపులకు దిగిన బీజేపీ
శ్రీలేఖ రాజీనామా వార్త బయటకు రావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఆమెను బుజ్జగించి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం వరకు ఆమెను ఒప్పించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా, మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో సేవలందించిన శ్రీలేఖ 2020లో డీజీపీగా రిటైరయ్యారు. కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఆమె 2024 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు.
అనంతరం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న ఆమె.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రముఖ ప్రచార ముఖంగా నిలిచారు. అయితే అధికారం వచ్చిందంటే అన్నీ సవ్యంగా సాగుతాయని అనుకుంటే.. రాజకీయాల్లో అది అంత ఈజీ కాదు అన్నట్లుగా ఇప్పుడు బీజేపీకి సొంత పార్టీ అసంతృప్తే కొత్త తలనొప్పిగా మారింది. శ్రీలేఖ రాజీనామా వెనక్కి తీసుకుంటారా? లేక అధికారికంగా రాజీనామా చేసి బీజేపీకి మరో షాక్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్ కీలక ప్రకటన


