ముంబై: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) నాయకులకు ఊహించని పరిణామం ఎదురైంది. నిరసనలో భాగంగా పార్టీ నాయకురాలు శైనా ఎన్‌సీ.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఫొటోను పొరపాటున చింపేశారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్ నాయకులు శైనాపై తీవ్ర విమర్శలు చేశారు.
సోనియా గాంధీ రాసిన 'బిలోంగింగ్' పుస్తకంలోని కొన్ని అంశాలు వీర్ సావర్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ షిండే వర్గం శివసేన బుధవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో శైనా ఎన్‌సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పుస్తకంలోని 201, 443 పేజీల్లో ఉన్న వివాదాస్పద అంశాలను తొలగించాలని ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్‌ను డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా పుస్తకంలోని పేజీలను చింపేశారు.

అయితే ఈ క్రమంలో శైనా ఎన్‌సీ పొరపాటున బాల్ ఠాక్రే ఫొటోను చింపారు. ఆ చిత్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ దిష్టిబొమ్మను బాల్ ఠాక్రే చెప్పులతో కొడుతున్న దృశ్యం ఉంది. ఈ విషయాన్ని సహచర నాయకుడు సంజయ్ నిరుపమ్ గుర్తుచేయడంతో శైనా వెంటనే చింపిన ఫొటోను కాగితాల కింద దాచేందుకు ప్రయత్నించారు. అనంతరం తాము చింపింది బాల్ ఠాక్రే ఫొటో కాదని, మణిశంకర్ అయ్యర్ చిత్రమని శివసేన నాయకులు పేర్కొన్నారు. శైనా కూడా తాను అయ్యర్ చిత్రాన్నే చింపానని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌తో ఉద్ధవ్ ఠాక్రే వర్గం పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుబట్టేందుకు ఈ ఫొటోను నిరసనకు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు బాల్ ఠాక్రే వ్యతిరేకంగా ఉండేవారని గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. షిండే వర్గం నాయకులను 'నకిలీ సైనికులు'గా అభివర్ణించారు. బాలాసాహెబ్‌ను అవమానించిన వారిని బహిరంగంగా కొరడాలతో కొట్టాలని వ్యాఖ్యానించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లోనూ ఈ వివాదం ప్రతిధ్వనించింది. ఉద్ధవ్ వర్గం కార్పొరేటర్లు శైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పందిస్తూ.. బాలాసాహెబ్‌ను అవమానించడాన్ని ఎవరూ సహించరని, షిండే వర్గం ఆయనపై చూపిస్తున్న అభిమానమంతా నకిలీదని విమర్శించారు. మేయర్ రీతూ తావ్డే కార్యాలయం ఎదుట కూడా కార్పొరేటర్లు నిరసన తెలిపారు.
మరోవైపు షిండే వర్గం శివసేన గ్రూప్ నాయకుడు అమేయ్ ఘోలే ఎదురుదాడి చేశారు. సోనియా గాంధీ పుస్తకం ఉద్ధవ్ వర్గానికి భగవద్గీతగా మారిందని విమర్శించారు. తాము చింపింది మణిశంకర్ అయ్యర్ ఫొటోనేనని, ఆ చిత్రమే ఉద్ధవ్ వర్గానికి బాధ కలిగిస్తోందని అన్నారు.
వివాదం నేపథ్యంలో శైనా ఎన్‌సీని ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే పిలిపించారు. ఆమె అసెంబ్లీలో షిండేను కలిశారు. కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, సంబంధిత ప్రతినిధులపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కూడా శివసేనపై విమర్శలు చేశారు. బాలాసాహెబ్ ఫొటో చింపడం మహారాష్ట్ర గౌరవాన్ని, ఆయనను అభిమానించే లక్షలాది మంది శివసైనికుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. పుస్తకాలను చింపినంత మాత్రాన ఆలోచనలను అంతం చేయలేరని, ఫొటోలను చింపి చరిత్రను చెరిపేయలేరని అన్నారు.
ఫొటో వెనుక నేపథ్యం: 2004 ఆగస్టు 27న ముంబైలోని శివాజీ పార్క్‌లో సావర్కర్ స్మారకం సమీపంలో బాల్ ఠాక్రే 'జోడే మారో' ఆందోళన చేపట్టారు. అప్పటి కేంద్ర పెట్రోలియం మంత్రి మణిశంకర్ అయ్యర్.. హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన నిర్వహించారు. బాల్ ఠాక్రే స్వయంగా చెప్పులతో అయ్యర్ దిష్టిబొమ్మను కొట్టగా, సీనియర్ శివసేన నాయకులు, వందలాది మంది కార్యకర్తలు కూడా పాత చెప్పులతో దానిపై దాడి చేశారు.
पत्रकार परिषदेत उपस्थित असलेल्या चेहऱ्यांकडे पाहिलं, तर त्यांच्याकडे ना वैचारिक बांधिलकी दिसते, ना पक्षनिष्ठा आणि ना जनतेप्रती कोणतीही आत्मीयता! अशा लोकांकडून सोनिया गांधीजींचं पुस्तक समजून घेण्याची किंवा त्यातील विचारांची खोली जाणून घेण्याची अपेक्षा करणंच मुळात चुकीचं आहे. कारण त्या पुस्तकाचा आशय आणि त्यामागील विचार त्यांच्या आकलनाच्या पलीकडचे आहेत. आदरणीय सोनिया गांधीजींच्या ‘Belonging: A Journey of Love’ या पुस्तकाने प्रकाशनानंतर अवघ्या एका आठवड्यात विक्रीचा जागतिक विक्रम प्रस्थापित केला. हा विक्रम म्हणजे त्यांच्या लेखनाला आणि विचारांना वाचकांनी दिलेली जागतिक पोचपावती आहे. त्याग, संयम, सहनशीलता, धैर्य, देशाप्रती निष्ठा आणि आपल्या विचारांशी अखेरपर्यंत एकनिष्ठ राहण्याची वृत्ती असलेल्या आदरणीय सोनियाजींचं व्यक्तिमत्त्व समजून घेण्यासाठी व्यापक वैचारिक दृष्टिकोन आणि बौद्धिक परिपक्वता असणं आवश्यक आहे. याच पत्रकार परिषदेत शायना एन.सी. यांनी आदरणीय बाळासाहेब ठाकरे यांचा फोटो फाडला. हा केवळ एका छायाचित्राचा अपमान नाही, तर महाराष्ट्राच्या अस्मितेचा आणि बाळासाहेबांवर अपार प्रेम करणाऱ्या लाखो शिवसैनिकांच्या भावनांचा अपमान आहे. पुस्तकं फाडून विचार संपवता येत नाहीत आणि छायाचित्रं फाडून इतिहास पुसता येत नाही. महाराष्ट्र हे कदापि विसरणार नाही आणि माफही करणार नाही!
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) November 18, 2026


