పృథ్వీ షా- సంజూ శాంసన్ (PC: MAH Cricket/BCCI Domestic X)
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో కేరళ జట్టు తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిన సంజూ శాంసన్ సేన.. రెండో మ్యాచ్‌లో సోమవారం మహారాష్ట్రతో తలపడింది. పృథ్వీ షా బృందాన్ని ఏకంగా 94 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది.
సంజూ మెరుపులు.. రోహన్ అర్ధ శతకం
న్యూ చండీగఢ్ వేదికగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌లో ఓపెనర్ మహ్మద్ అజారుద్దీన్ (1), వన్‌డౌన్ బ్యాటర్ అహ్మద్ ఇమ్రాన్ (13) విఫలమయ్యారు.
అయితే, మరో ఓపెనర్ రోహన్ కణ్ణుమ్మల్ మెరుపు అర్ధ శతకం (47 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో ఆకట్టుకున్నాడు. ఈసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది ఏకంగా 47 పరుగులు రాబట్టాడు. సంజూ- రోహన్ కలిసి కలిసి మూడో వికెట్‌కు 26 బంతుల్లో 66 పరుగులు జోడించారు.
211 పరుగులు
మిగతా వాళ్లలో విష్ణు వినోద్ (19) ఫర్వాలేదనిపించగా.. సల్మాన్ నిజార్ మెరుపులు (13 బంతుల్లో 29 నాటౌట్) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో కేరళ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు, విక్కీ ఓస్త్వాల్ రెండు వికెట్లు తీయగా.. రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ సోలంకి చెరో వికెట్ దక్కించుకున్నారు.
పృథ్వీ షా విఫలం.. 117 పరుగులకే ఆలౌట్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర 16 ఓవర్లలో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా (6), అర్షిణ్ కులకర్ణి (5) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సాహిల్ పరేఖ్ 18 పరుగులు చేయగలిగాడు.
మిగిలిన వారిలో రాహుల్ త్రిపాఠి (4), కిరణ్ చార్మోలే (0), విక్కీ ఓస్త్వాల్ (2), ముకేశ్ చౌదరి (5), తనయ్ సంఘ్వీ (7) ఇలా వచ్చి అలా వెళ్లగా.. రామకృష్ణ ఘోష్ 28, పదకొండో స్థానంలో వచ్చిన ప్రశాంత్ సోలంకి (14 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు.
చెలరేగిన నిధీశ్
కేరళ బౌలర్లలో ఎండీ నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగి మహారాష్ట్ర బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. బిజు నారాయణన్ మూడు వికెట్లు కూల్చాడు. కేఎమ్ ఆసిఫ్, కార్తిక్ బి నాయర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
కాగా ఈ సీజన్‌లో కేరళకు ఇదే తొలి విజయం కాగా.. మహారాష్ట్రకు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో పృథ్వీ షా సేన 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా కేరళ చేతిలోనూ ఓటమి మూటగట్టుకుంది.
ఇవీ చదవండి: ఈగలా అతడిని టీమిండియా నుంచి తీసేశారు.. ఇదేం పద్ధతి?
నువ్వు నిజం.. అందుకే ఐ లవ్ యూ: సానియా మీర్జాకు విషెస్


