‘ఆర్సీబీ’ కెప్టెన్‌ పాటిదార్‌ ప్రపంచ రికార్డు | Rajat Patidar 48 Ball 135 Creates History Breaks 12 Year Old World Record | Sakshi
Sakshi News home page

‘ఆర్సీబీ’ కెప్టెన్‌ పాటిదార్‌ ప్రపంచ రికార్డు

Nov 16 2026 5:40 PM | Updated on Nov 16 2026 5:40 PM

Rajat Patidar 48 Ball 135 Creates History Breaks 12 Year Old World Record

PC: BCCI Domestic X

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో మధ్యప్రదేశ్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో కేరళను ఓడించిన మధ్యప్రదేశ్‌.. తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో అసోం జట్టును ఏకంగా 131 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

మధ్యప్రదేశ్‌ సారథి, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అసోం బౌలర్లపై విరుచుకుపడి పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, పదమూడు సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సరికొత్త ప్రపంచ రికార్డు
తద్వారా రజత్‌ పాటిదార్‌ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదు లేదంటే అంతకంటే లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో డాన్‌ క్రిస్టియన్‌ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టాడు.

శివాంగ్‌ కుమార్‌ మెరుపు అర్ధ శతకం
న్యూ చండీగఢ్‌ వేదికగా టాస్‌ గెలిచిన అసోం జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. మధ్యప్రదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ శివాంగ్‌ కుమార్‌ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 61) బాదగా.. ఐదో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఆకాశమే హద్దు (48 బంతుల్లో 135 నాటౌట్‌)గా చెలరేగాడు.

119 పరుగులకే ఆలౌట్‌
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మధ్యప్రదేశ్‌ ఏకంగా 250 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన అసోం 17.4 ఓవర్లలో కేవలం 119 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. శివ్‌శంకర్‌ రాయ్‌ 32 పరుగులతో అసోం టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

మధ్యప్రదేశ్‌ బౌలర్లలో కుమార్‌ కార్తికేయ మూడు వికెట్లతో సత్తా చాటగా.. ఆవేశ్‌ ఖాన్‌, రాహుల్‌ బాతమ్‌ చెరో రెండు.. త్రిపురేశ్‌ సింగ్‌, శివం శుక్లా, శివాంగ్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి 2025లో తొలిసారి టైటిల్‌ అందించిన రజత్‌ పాటిదార్‌.. 2026లో సారథిగా జట్టును చాంపియన్‌గా నిలిపి చరిత్ర సృష్టించాడు.

పురుషుల టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదు లేదంటే అంతకంటే లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు
🏏రజత్‌ పాటిదార్‌ (మధ్యప్రదేశ్‌)- 2026లో న్యూ చండీగఢ్‌ వేదికగా అసోం జట్టు మీద 135 పరుగులు నాటౌట్‌
🏏డాన్‌ క్రిస్టియన్‌ (మిడిల్‌సెక్స్‌)- 2014లో కాంటెర్‌బరీ వేదికగా కెంట్‌ జట్టు మీద 129 పరుగులు
🏏షెహ్రేయర్‌​ బట్‌ (బెల్జియం)- 2020లో వెల్ఫేర్‌డేంజ్‌ వేదికగా చెక్‌ రిపబ్లిక్‌ జట్టుపై 125 పరుగులు
🏏సలీల్‌ అరోరా (పంజాబ్‌)- 2025లో అంబీ వేదికగా జార్ఖండ్‌ జట్టుపై 125 పరుగులు నాటౌట్‌
🏏ఆండ్రీ రసెల్‌ (జమైకా తల్లావాస్‌)- 2018లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ట్రింబాగో జట్టు మీద 121 పరుగులు.

ఇదీ చదవండి: IND vs NZ Tests: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement