source: X
భారత్ అండర్-19 జట్టు ఆసియా కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ మోహిత్ ఉల్వాకు అదిరిపోయే అవకాశం దక్కింది. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో చివరి బంతికి బౌండరీ బాది భారత్‌కు విజయాన్ని అందించిన అతడిని సౌరాష్ట్ర సీనియర్ జట్టులోకి (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026) ఎంపిక చేశారు.
ఉల్వా ఎంపికను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా ధ్రువీకరించారు. మోహిత్‌లోని పోరాటపటిమ, ప్రతిభను గుర్తించి సీనియర్ క్రికెట్‌లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
మోహిత్‌ను నేరుగా ఇండోర్‌కు వెళ్లి సౌరాష్ట్ర జట్టుతో చేరాలని సూచించారు. 18 ఏళ్ల వయసులోనే సీనియర్ స్థాయి క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం రావడం అతడి కెరీర్‌లో కీలక పరిణామమని అన్నారు.
కాగా, పాకిస్తాన్‌తో నిన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ వికెట్ తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 337 పరుగుల అతి భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఛేదనలో భారత్ తడబడుతూనే చివరి వరకూ మ్యాచ్‌ను లాక్కొచ్చింది. విజయానికి చివరి 9 ఓవర్లలో దాదాపు 80 పరుగులు అవసరమైన సమయంలో మోహిత్ ఉల్వా క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతడు డెత్ ఓవర్లలో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ముఖ్యంగా 49వ ఓవర్లో మహమ్మద్ సయ్యమ్ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో బౌండరీ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మోహిత్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మోహిత్‌కు సీనియర్ జట్టులో అవకాశం కల్పించింది.
ఇదీ చదవండి: IND vs PAK: ఆఖరి బంతికి టీమిండియాను గెలిపించాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా?


