'యువ' గర్జన | India sensational victory over Pakistan by a margin of wickets in the Under 19 Asia Cup final | Sakshi
Sakshi News home page

'యువ' గర్జన

Nov 15 2026 4:40 AM | Updated on Nov 15 2026 4:41 AM

India sensational victory over Pakistan by a margin of wickets in the Under 19 Asia Cup final

విన్నర్స్‌ ట్రోఫీతో భారత అండర్‌–19 జట్టు

అండర్‌–19 ఆసియా కప్‌ చాంపియన్‌ భారత్‌  

ఫైనల్లో వికెట్‌ తేడాతో పాక్‌పై సంచలన విజయం

338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కుర్రాళ్లు

గెలిపించిన మోహిత్, మనాల్, లక్ష్య, ఆర్యవీర్‌ 

భారత్‌ విజయానికి చివరి బంతికి మూడు పరుగులు కావాలి... మోహిత్‌ ఉల్వా కొట్టిన షాట్‌ లాంగాఫ్‌ మీదుగా బౌండరీని చేరగానే మన యువ ఆటగాళ్ల సంబరాలు షురూ అయ్యాయి. మైదానంలోకి దూసుకొచ్చిన కుర్రాళ్లంతా ఒక్కొక్కరూ తమ కసిని, ఆనందాన్ని అనుచిత సైగలతో కలగలిపి ప్రదర్శించారు...హైదరాబాద్‌ బౌలర్‌ యశ్వీర్‌ గౌడ్‌ అయితే మరికాస్త ముందుకు వెళ్లి పాక్‌ కీపర్‌ జహూర్‌పైకి దూసుకొచ్చి ‘ఫేస్‌ టు ఫేస్‌’ తన ఆగ్రహావేశాన్ని చూపించాడు.

ఇది కేవలం ఒక మ్యాచ్‌ గెలిచిన సంతోషం మాత్రమే కాదు... ఏమాత్రం అవకాశం లేని చోట అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన యువ సత్తాకు నిదర్శనం. ఎక్కడా తగ్గకుండా చివరి వరకు పట్టుదలగా నిలిచి అద్భుత ఆటతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఘట్టం... వారం రోజుల క్రితం ఇదే పాక్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ నాడు వికృతంగా సంబరాలు చేసుకున్న పాక్‌కు ఇప్పుడు అదే రీతిలో జవాబిస్తూ భారత్‌ ఆసియా అండర్‌–19 విజేతగా నిలిచింది.

భారత్‌ స్కోరు 252/8...గెలుపు కోసం మిగిలిన 51 బంతుల్లో 86 పరుగులు చేయాలి. ఈ దశలో మనాల్, మోహిత్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఈ జోడి తొమ్మిదో వికెట్‌కు 35 బంతుల్లోనే 57 పరుగులు జోడించింది. మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో మనాల్‌ వెనుదిరిగాడు. సమీకరణం 16 బంతుల్లో 29 పరుగులుగా మారింది. కానీ మిగిలింది ఒకటే వికెట్‌!  

టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఆంధ్ర కుర్రాడు వెంకట సుభాష్‌ అండగా నిలవగా... మోహిత్‌ బాధ్యత తీసుకున్నాడు. 19వ ఓవర్లో మోహిత్‌ వరుసగా 4, 6 కొట్టగా... సుభాష్‌ కూడా ఒక ఫోర్‌ కొట్టడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇక చివరి  ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా... తొలి 5 బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి మోహిత్‌ ఫోర్‌ బాదడంతో భారత్‌ అసాధారణ గెలుపును అందుకుంది.

అల్‌ అమీరట్‌ (మస్కట్‌): ఆసియా కప్‌ అండర్‌–19 టోర్నీని భారత్‌ సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్‌ వికెట్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ముందుగా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాన్‌ (111 బంతుల్లో 107; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... అబ్దుల్‌ ఖాదిర్‌ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసుఫ్‌ (60 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. 

భారత బౌలర్లలో  పరేశ్‌ పటేల్‌ 4 వికెట్లు పడగొట్టగా... చిగురుపాటి వెంకట సుభాష్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసి విజేతగా నిలిచింది. కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని (101 బంతుల్లో 80; 5 ఫోర్లు), ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (61 బంతుల్లో 58; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు చేయగా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మోహిత్‌ ఉల్వా (26 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనాల్‌ చౌహాన్‌ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  

కీలక భాగస్వామ్యాలు... 
ఉస్మాన్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టగా, మూడో స్థానంలో వచ్చిన ఖాదిర్‌ మరింత ధాటిగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో చెలరేగిన ఖాదిర్‌ 39 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అతను వెనుదిరిగిన తర్వాత ఉస్మాన్, ఫర్హాన్‌ కలిసి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. 106 బంతుల్లో ఉస్మాన్‌ ఈ టోర్నీలో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోరు 274/3. ఆరంభంలో భారీగా పరుగులిచ్చినా... చివరి పది ఓవర్లలో ప్రత్యర్థిని నిలువరించడంలో భారత్‌ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో పాక్‌ 63 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది.  

ఆర్యవీర్‌ జోరుగా... 
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు లక్ష్య, ఆర్యవీర్‌ మంచి పునాది వేశారు. లక్ష్య కాస్త జాగ్రత్త ప్రదర్శించగా, ఆర్యవీర్‌ తనదైన శైలిలో దూకుడు చూపించాడు. తొలి 10 ఓవర్లలో స్కోరు 54/0కు చేరింది. ఆ తర్వాత 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగానే ఆర్యవీర్‌ వెనుదిరిగడంతో 95 పరుగుల (106 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం 72 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న లక్ష్య...రెండో వికెట్‌కు వీకే వినీత్‌ (24)తో 51 పరుగులు జత చేశాడు. 

అయితే తక్కువ వ్యవధిలో వినీత్, అర్జున్‌ రాజ్‌పుత్‌ (16), యశ్‌వర్ధన్‌ (9) అవుటయ్యారు. 14 ఓవర్లలో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌కు మళ్లీ ఎదురు దెబ్బ తగలింది. నిలదొక్కుకున్న లక్ష్యను రజా పెవిలియన్‌ పంపించగా, దురదృష్టవశాత్తూ తర్వాతి బంతికే అన్వయ్‌ ద్రవిడ్‌ (19) రనౌటయ్యాడు. పరుగు తేడాతో ఆర్యన్‌ (9), పటేల్‌ (0) కూడా నిష్క్రమించారు. దాంతో భారత్‌ ఓటమికి చేరువైనట్లుగా కనిపించింది.  

‘వీరూ’ బాటలోనే ‘వీర్‌’  
70 నాటౌట్, 22, 160, 51, 58... టోర్నీ ఐదు మ్యాచ్‌లలో ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ స్కోర్లు ఇవి. భారత క్రికెట్‌లో విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన తండ్రి వీరేందర్‌ సెహ్వాగ్‌ బాటలోనే కొడుకు కూడా అదే ధాటిని అండర్‌–19 స్థాయిలోనే చూపిస్తున్నాడు. 95.50 స్ట్రైక్‌రేట్‌తో 361 పరుగులు బాదిన ఆర్యవీర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. లీగ్‌ దశలో పాక్‌తో మ్యాచ్‌లోనే విఫమైన అతను ఈ సారి అదే జట్టుపై పరుగులు సాధిస్తానని పంతం పట్టి మరీ చేసి చూపించాడు.   

కెప్టెన్‌ లక్ష్యరాయ్‌ చందాని (243 పరుగులు), ఇషాన్‌ సూద్‌ (11 వికెట్లు) కూడా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్‌లో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు కూడా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వుట్కూర్‌ యశ్వీర్‌ గౌడ్‌ లీగ్‌ దశలో 2 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీయగా...ఆంధ్రప్రదేశ్‌ పేసర్‌ చిగురుపాటి వెంకట నాగ సుభాష్‌ ఫైనల్లో బరిలోకి దిగి 3 వికెట్లు తీశాడు. చివరి వికెట్‌గా బరిలోకి దిగి 8 బంతుల్లో 2 ఫోర్లతో అజేయంగా 11 పరుగులు చేసిన విలువ ఈ మ్యాచ్‌ విజయంలో అమూల్యం!   

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ అండర్‌–19 ఇన్నింగ్స్‌: ఉస్మాన్‌ (సి) అర్జున్‌ (బి) పటేల్‌ 107; హాయమ్‌ (సి) ద్రవిడ్‌ (బి) పటేల్‌ 21; ఖాదిర్‌ (సి) వినీత్‌ (బి) అర్జున్‌ 80; ఫర్హాన్‌ (సి) ఆర్యన్‌ (బి) వెంకట 63; అహ్మద్‌ (సి) ఆర్యవీర్‌ (బి) వెంకట 17; జహూర్‌ (సి) ఉల్వ (బి) పటేల్‌ 10; అబ్బాస్‌ (సి) చౌహాన్‌ (బి) వెంకట 2; సయామ్‌ (రనౌట్‌) 7; షఫీఖ్‌ (బి) పటేల్‌ 11; రిజ్వానుల్లా (నాటౌట్‌) 4; రజా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337.  వికెట్ల పతనం: 1–62, 2–197, 3–240, 4–299, 5–305, 6–311, 7–317, 8–332, 9–336. బౌలింగ్‌: మోహిత్‌ ఉల్వా 8–0–57–0, కావ్య పటేల్‌ 10–0–68–4, చిగురుపాటి వెంకట 5–0–40–3, మనాల్‌ చౌహాన్‌ 3–0–40–0, ఆర్యన్‌ 7–0–36–0, యశ్‌వర్ధన్‌ 6–0–35–0, అర్జున్‌ 7–0–43–1, వినీత్‌ 4–0–14–0. 

భారత్‌ అండర్‌–19 ఇన్నింగ్స్‌: లక్ష్య (సి) అబ్బాస్‌ (బి) రజా 80; ఆర్యవీర్‌ (సి) ఉస్మాన్‌ (బి) షఫీఖ్‌ 58; వినీత్‌ (సి) ఉస్మాన్‌ (బి) రిజ్వానుల్లా 24; అర్జున్‌ (సి) జహూర్‌ (బి) రిజ్వానుల్లా 16; యశ్‌వర్ధన్‌ (సి) ఉస్మాన్‌ (బి) అబ్బాస్‌ 9; అన్వయ్‌ (రనౌట్‌) 19; మనాల్‌ (సి) ఉస్మాన్‌ (బి) షఫీఖ్‌ 47; ఆర్యన్‌ (సి) హాయమ్‌ (బి) రిజ్వానుల్లా 9; పటేల్‌ (సి) జహూర్‌ (బి) సయామ్‌ 0; ఉల్వా (నాటౌట్‌) 49; వెంకట (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 9 వికెెట్లకు) 339.  వికెట్ల పతనం: 1–95, 2–146, 3–172, 4–186, 5–217, 6–217, 7–251, 8–252, 9–309.  బౌలింగ్‌: అలీ రజా 10–0–65–1, సయామ్‌ 10–0–79–1, రిజ్వానుల్లా 10–0–53–3, షఫీఖ్‌ 10–0–57–2, హుస్సేన్‌ 5–0–38–0, అబ్బాస్‌ 5–0–39–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement