ఆసియా కప్ ఫైనల్లో భారత్- పాక్ పోరు (PC: ACC Media X)
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2026 వన్డే టోర్నమెంట్ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆది నుంచే పేలవ ప్రదర్శనతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్ భారీ స్కోరు సాధించగలిగింది.
అల్ ఎమిరెట్ వేదికగా శనివారం నాటి ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో హయామ్ ఖాన్ (21) ఓ మోస్తరుగా రాణించగా.. ఉస్మాన్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి శతక్కొట్టాడు. మొత్తంగా 111 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాన్.. పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 107 పరుగులు సాధించాడు.
ఎట్టకేలకు కావ్యా పటేల్ బౌలింగ్‌లో అర్జున్ రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇచ్చి ఉస్మాన్ వెనుదిరిగాడు. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన అబ్దుల్ ఖాదిర్ కూడా బ్యాట్ ఝులిపించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ మెరుపు అర్ధ శతకం (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదాడు.
మరోవైపు.. ఫర్హాన్ యూసఫ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (60 బంతుల్లో 63)తో మెరిశాడు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో పాక్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 337 పరుగులు సాధించింది. కాగా ఖాదిర్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఉస్మాన్ ఖాన్.. ఫర్హాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఇక భారత బౌలర్లలో కావ్యా పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చిగురుపాటి వెంకట మూడు, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.


