న్యూఢిల్లీ: ఢిల్లీలో నిరసనలు, ఆందోళనలకు కేంద్రంగా ఉన్న మరో వేదికపై ఆంక్షలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన ఢిల్లీ పోలీసులు.. ఇప్పుడు రాంలీలా మైదానంలోనూ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇకపై ఇక్కడ నిర్వహించే ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలకు గరిష్ఠంగా 50 వేల మందికే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా రాంలీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానాలను గత అక్టోబర్‌లో పోలీసులు గుర్తించారు. తాజాగా రాంలీలా మైదానానికి ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్ఓపీ) రూపొందించారు. కార్యక్రమం స్వభావం, అంచనా జనసందోహం, భద్రతా ఏర్పాట్ల ఆధారంగా ఎంతమందికి అనుమతించాలనేది అధికారులు నిర్ణయిస్తారు.
నిర్వాహకులు తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నుంచి మైదానం అందుబాటుపై అనుమతి తీసుకోవాలి. అనంతరం పోలీసులకు దరఖాస్తు చేయాలి. సాధారణంగా కార్యక్రమానికి పది రోజుల ముందే దరఖాస్తు సమర్పించాలి. ట్రాఫిక్, పార్కింగ్, వాహనాలు దిగే ప్రాంతాలు, అత్యవసర మార్గాల నిర్వహణ బాధ్యత నిర్వాహకులదే.
మైదానంలోకి తుపాకులు, కత్తులు, ఈటెలు, పదునైన వస్తువులను అనుమతించరు. డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ ఏర్పాట్లు కూడా చేయాలి. ప్రస్తుతం ఈ ముసాయిదా ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఆమోదం కోసం వేచి ఉంది. తుది ఆమోదం తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
ఇదీ చదవండి: ముంబైలో విచిత్రం.. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ!


