న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’కూటమి నిర్వహించిన ర్యాలీకి పోటీగా ఢిల్లీలో బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ నుంచి తిలక్ నగర్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి మాట్లాడుతూ... 1984లో ఢిల్లీలో సిక్కులపై హింసాకాండ ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు.
అధికారిక గణాంకాల ప్రకారం హింసాకాండలో మొత్తం 2,733 మంది సిక్కులు దారుణంగా హత్యకు గురయ్యారని తెలిపారు. ఇది ఒక జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేకమైన నేరం అని విమర్శించారు. 1984 నవంబర్ 1న జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల గాయాలు నేటికీ పచ్చిగానే ఉన్నాయని చెప్పారు. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సిక్కు సమాజం మనోభావాలను గాయపర్చిందని ధ్వజమెత్తారు. నిరసన ప్రదర్శనలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్‡్ష మల్హోత్రా పాల్గొన్నారు.


