మోదీ, అమిత్ షాలు కూడా తప్పించుకోలేరు
ఓటు దొంగిలించడమంటే ప్రతి పౌరుడి గళాన్ని, అభీష్టాన్ని దొంగిలించడమే
మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లు దేశం గొంతును నొక్కేశారు
దేశాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించాం
విపక్ష ‘ఇండియా’కూటమి ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
బీజేపీని అధికారం నుంచి కూలదోయాలని ప్రతిపక్ష కూటమి పిలుపు
జ్ఞానేశ్ కుమార్ భూగర్భంలో దాక్కున్నా వెతికి పట్టుకుంటామన్న ఖర్గే
న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి కూలదోయా లని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి దేశ ప్రజ లకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసులో విచారణ జరిపి, జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు. ఓట్ల చోరీని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’కూటమి నేతలు ఆదివారం ఢిల్లీలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్,రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నాయకుడు జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థరూర్, అభిషేక్ సింఘ్వీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్, నేహా బోరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జ్ఞానేశ్ కుమార్‌ను దించేసిన తర్వాత మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని, ఓట్ల దొంగతనానికి సంబంధించి వారిద్దరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టం నుంచి తప్పించుకోవాలని చూడొద్దని వారికి సూచించారు. రామ్‌లీలా మైదానంలో రాహుల్ ప్రసంగించారు. 2024 నాటి లోక్‌సభ ఎన్నికలు చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమేనని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుండి 15 శాతం మంది ఓటర్లను తొలగించిందని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే..
వారు వెళ్లాలనుకున్నా వెళ్లనివ్వం
‘‘నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లడం లేదని అమిత్ షా చెప్పారు. నిజం చెప్పాలంటే నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లలేరు. ఒకవేళ ఆయన వెళ్లాలనుకున్నా, మేము వెళ్లనివ్వం. ఈ దేశానికి న్యాయం జరుగుతుంది. ఓట్ల దొంగతనానికి, దేశాన్ని అదానీకి అమ్మేసినందుకు మేము న్యాయం కోరుతున్నాం. పారిపోవాలని అనుకోవద్దు. మీరు ఇక్కడే ఉండాలి. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రజల గళమే ప్రేరణగా నిలుస్తుంది. ఇది ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకులకు సంబంధించిన నిరసన కాదు. ఇది యువత, రైతులు, కార్మికుల స్వరం. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం కానివ్వబోం అని ఇది చాటిచెబుతోంది. పాలకుల దగ్గర ఎంత అధికారం, ఎంత డబ్బు ఉన్నప్పటికీ, వారు రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు.
ఇది సాధారణ దొంగతనం కాదు
2024 నాటి లోక్‌సభ ఎన్నికలతోపాటు పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, హరియాణా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగింది. ఈవీఎంల ద్వారా, అలాగే ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం, కొత్తగా చేర్చడం ద్వారా ఓట్ల చోరీకి పాల్పడ్డారు. 2024 ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా నుంచి 13.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. అంటే ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరు ఓటు హక్కు కోల్పోయారు. సుమారు 15 శాతం మంది ఓటర్లను జాబితాల తొలగించారు. 2024 నాటి ఎన్నికలు చట్టవిరుద్ధమని చెప్పక తప్పదు. ఓట్ల దొంగతనం సాధారణ దొంగతనం కాదు. ఇది ప్రతి పౌరుడి గళాన్ని, వారి అభీష్టాన్ని దొంగిలించడం. దీనినే దేశద్రోహం అంటారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదు, అమిత్ షా హోంమంత్రి అయ్యేవారు కాదు.
అలాంటి దేశం మాకొద్దు
దేశంలోని అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ తన అధీనంలోకి తీసుకుంది. దీనివల్ల రైతులు, కార్మికులు, యువత తమ హక్కులను పొందలేకపోతున్నారు. దేశ సంపద మొత్తం ఇద్దరు–ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారికి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ లభిస్తోంది. అదే సమయంలో, ఒక రైతు కుమారుడు చిన్నపాటి అప్పును కూడా చెల్లించలేకపోతే, అతడిని జైలుకు పంపిస్తున్నారు. శివుడి బరాత్(శివుడి ఊరేగింపు)లో ఎవరైనా ఎలాగైతే పాల్గొనవచ్చో, దేశం కూడా అలాగే ఉండాలి.
గౌతమ్ అదానీ వంటి బడా బాబులు ఏదైనా సంస్థను తన ఆ«దీనంలోకి తెచ్చుకోవడం, మౌలిక సదుపాయాలను లాగేసుకోవడం వంటివి జరిగే దేశం మాకు వద్దు... ఇలా జరగనివ్వబోం. దేశాన్ని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావాలంటే జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడమే మొదటి అడుగు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లను ద్వేషించడం లేదు. మేము మొహబ్బత్ కీ దుకాన్ తెరిచే వ్యక్తులం. అహింసను నమ్ముతాం. ఆ ముగ్గురూ దేశ ఆత్మపై, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. మేము దీనికి అంగీకరించే ప్రసక్తే లేదు. నాకు ఎవరూ శత్రువులు కారు. నా మతం ఏమిటని మీరు నన్ను అడిగితే, ప్రతి పౌరుడి గళం వినిపించడమే నా మతం అని చెబుతాను. నాకు అత్యంత ముఖ్యమైనది ప్రజల గళమే.
అందుకే వారికి నిద్ర పట్టడం లేదు
వరుసలో చివరన నిలబడిన వ్యక్తి గొంతుక అత్యంత ముఖ్యమైనది. హిందువు, ముస్లిం, సిక్కు, దళితుడు, ఆదివాసి, మహిళ లేదా దివ్యాంగుడు.. ఎవరైనప్పటికీ, వారి గొంతుకను మనం కాపాడాలి. ద్వేషాన్ని నిర్మూలించాలి. మోదీ–షా–ఆర్ఎస్ఎస్లు దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేశాయి, ఇది దేశ ఆత్మకే హాని కలిగిస్తోంది. మాకు ద్వేషం వద్దు, ప్రేమ, సోదరభావం కావాలి, ప్రేమతో కూడిన దేశం కావాలని దేశం మొత్తం నినదిస్తోంది. మేము కచ్చితంగా దీన్ని సాకారం చేస్తాం. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లు దేశం గొంతును నొక్కేశారు. అందుకే వారికి నిద్ర పట్టడం లేదు. దేశాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించాలని ఇండియా కూటమి నిర్ణయించింది’’అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి..
‘ఇండియా’కూటమి నాయకులు తొలుత మింట్ రోడ్–కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్‌లీలా మైదానం వైపు ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది మద్దతుదారులు వారితో పాటు నడిచారు. ఈ సందర్భంగా వాహనంలో రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డి.రాజా, ఎం.ఎ.బేబీ, దీపాంకర్ భట్టాచార్య తదితరులు ఉన్నారు. ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానం పరిసరాల్లో దాదాపు 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించారు. 3 వేల మందికి పైగా పోలీసులు, 10 వేల మంది పారామిలటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. జనసమూహం అదుపు తప్పకుండా, జంతర్ మంతర్ వైపు కదలకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. కానీ, ఆ పార్టీ సభ్యులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బొరా తమ సభ్యులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీలో ఎవరేమన్నారంటే.. బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎస్ఐఆర్
‘‘దేశంలో ఎన్నికలను బీజేపీ కుట్రపూరితంగా తారుమారు చేస్తోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకుంటోంది. బీజేపీపై పోరాటం సాగించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, సమాజంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎస్ఐఆర్ను తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ వల్ల పశ్చిమ బెంగాల్ ఒక బాధిత రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి, జెన్ జెడ్ పోరాట స్ఫూర్తికి నా సంఘీభావం తెలియజేస్తున్నా’’
– మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు సిద్ధం
‘‘రామ్‌లీలా మైదానం నేడు ప్రజాస్వామ్య హల్దీఘాటిగా మారింది. ఇది రాబోయే మార్పుకు సంకేతం. ఉత్తరప్రదేశ్ ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు, అదే మార్గం ద్వారా అధికారం నుంచి నిష్క్రమించడం ఖాయం. వారణాసిలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ప్రజలు బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని డబుల్ జీరోగా మార్చేశారు. ఎస్ఐఆర్ ముసుగులో విచ్చలవిడిగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. 2022లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి ఈ ఓట్ల దొంగతనమే కారణం. భారతదేశాన్ని విశ్వగురువుగా చేస్తామని గొప్పలు చెప్పుకున్నవారు నేడు ఓటర్ల జాబితాలను తారుమారు చేయడంలో నిమగ్నం కావడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమవుతుంది’’
– అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
చొరబాటుదారులనే ముద్ర వేస్తున్నారు
‘‘ఎస్ఐఆర్లో భాగంగా తొలగించిన చాలామంది ఓటర్లపై చొరబాటుదారులనే ముద్రవేస్తుండడం చాలా దారుణం. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల నుంచి తొలగింపునకు గురైన హిందూ ఓటర్లు కూడా పాకిస్తానీలేనా? ఎంతకాలం సాకులు చెబుతారు? ముస్లింలను పాకిస్తానీలని పిలుస్తూ వారి విధేయతను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు పదేపదే ప్రశ్నిస్తున్నాయి. ముస్లింలు కూడా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. మేము ఈ దేశం కోసం మా రక్తాన్ని ధారపోశాం. మేము ఈ దేశంలోనే జీవిస్తాం, దేశాన్ని బలోపేతం చేస్తాం’’
– ఫరూఖ్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్
రాజ్యాంగం ఇచ్చిన హక్కును లాక్కుంటున్నారు
‘‘దేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలను విస్మరిస్తూ, దేశ ఆస్తులను కార్పొరేట్ మిత్రుడికి ధారాదత్తం చేస్తోంది. అంతేకాకుండా, భూములను కార్పొరేట్ సంస్థలకు అతి తక్కువ ధరలకే అప్పగిస్తున్నారు. ఉపాధిపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ, సైన్యంలో చేరిన వారిని సైతం రోజువారీ కూలీలుగా మార్చేశారు. తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి, ప్రభుత్వాలను మార్చడానికి రాజ్యాంగం ప్రజలకు హక్కు కల్పించింది. కానీ, నేటి ప్రభుత్వం ఆ హక్కును లాక్కోవాలని చూస్తోంది’’
– మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు
ఇది ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య పోరాటం
‘‘ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మహాభారతంలో జరిగిన పోరాటం లాంటిదే. ఇది దేశంలో ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న పోరాటం. నేడు శకుని తన ఆట ఆడుతున్నాడు. మనం కురుక్షేత్రంలో పోరాడాల్సి ఉంది. అసలు శకుని ఎవరో అందరికీ తెలుసు. జ్ఞానేశ్ కుమార్ ప్రధాని మోదీకి ఒక నమ్మిన బంటు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. అప్పుడే భవిష్యత్తులో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే సాహసం చేయరు. దేశాన్ని ఎంచుకుంటారో లేక జ్ఞానేశ్ కుమార్‌ను ఎంచుకుంటారో ప్రధాని మోదీ తేల్చుకోవాలి. ప్రభుత్వం ‘దో నెంబరీ సర్కార్’, మోదీ ‘దస్ నంబర్ ప్రధాని’. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలి’’
– తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత
ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం
‘‘ఎస్ఐఆర్ అనేది ఓటు హక్కులపై సర్జికల్ స్ట్రైక్‌గా మారింది. ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు నేడు పోరాటం సాగుతోంది. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కాన్ రాజ్యాంగ హక్కులను దెబ్బతీస్తోంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లాలి. ఓటు హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం లాంటివి. ఈ రెండు హక్కులూ దాడికి గురవుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంలో మార్పులు చేయాలి’’
– దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
‘‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కోట్లాది మంది సామాన్య ప్రజల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలగే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతాయి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’
– జాన్ బ్రిట్టాస్, సీపీఎం ఎంపీ
పౌరుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం
‘‘ఇది కేవలం రాజకీయ నాయకుల పోరాటం కాదు. ముమ్మాటికీ దేశ పౌరులందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. మన ఓటును కాపాడుకోవడానికి, రాజ్యాంగం మనకిచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి పౌరులంతా శాంతియుతంగానే పోరాటానికి ముందుకు రావాలి. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడం మనందరి బాధ్యత’’
– ప్రకాశ్ రాజ్, సినీ నటుడు


