న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి ఢిల్లీ వేదికైంది. ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం భారీ నిరసన ప్రదర్శనకు చేపట్టింది. 'ఓట్ బచావో.. దేశ్ బచావో' నినాదంతో రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఢిల్లీలోని మింటో రోడ్-కనాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమైంది. అక్కడి నుంచి అజ్మేరీ గేట్ మీదుగా రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి విపక్ష నేతలు ప్రత్యేక ఓపెన్ బస్సుల్లో బయలుదేరి మార్చ్ ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచే రామ్‌లీలా మైదాన్‌కు నిరసనకారులు చేరుకోవడం ప్రారంభమైందని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ తెలిపారు. ఉదయం 10.48 గంటల సమయానికి మైదానంలో జనసందోహం పెరిగినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు కనాట్ ప్లేస్ నుంచి రామ్‌లీలా మైదాన్ వైపు మార్చ్ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు కూడా సుర్జీత్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ కూడా రామ్‌లీలా మైదాన్‌లో వినిపించే గొంతు పార్లమెంట్‌లో ప్రతిధ్వనించాలని పేర్కొన్నారు.


