ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో భూగర్భ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన నలుగురు సిబ్బంది విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వారిని కాపాడేందుకు ప్రయత్నించి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి దేవాస్ రోడ్డులోని శ్రీ గంగా హోటల్‌లో జరిగింది. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో హోటల్ మిఠాయిలు, పాల ఉత్పత్తుల విభాగాల నుంచి వచ్చే మిగిలిపోయిన ఆహారం, ఇతర వ్యర్థాలను సేకరించే గదిలో శుభ్రత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది లోపలికి వెళ్లగా విషవాయువు ప్రభావంతో కుప్పకూలిపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన ఇతరులు కూడా అస్వస్థతకు గురయ్యారు.
మృతులను ఉజ్జయినికి చెందిన కమలేశ్, నితిన్, వహీద్, రాజస్థాన్‌లోని ఝాలావర్‌కు చెందిన మనోజ్ మీనాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విద్యుత్ కట్టర్‌తో గదిలోని కొంత భాగాన్ని తొలగించి బాధితులను బయటకు తీశారు. పోలీసులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ నలుగురినీ కాపాడలేకపోయారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. బాధితులను రక్షించేందుకు వెళ్లిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి కొత్త రూల్స్.. రాజధాని ప్రజలకు ఇక కష్టాలే!


