అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాక్! | American Express Is Cutting 3500 Jobs Globally | Sakshi
Sakshi News home page

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాక్!

Oct 25 2026 2:49 PM | Updated on Oct 25 2026 3:19 PM

American Express Is Cutting 3500 Jobs Globally

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 5 శాతానికి సమానం.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. ఖర్చులను తగ్గించుకోవడం, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, భవిష్యత్తులో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచుకోవడం అని తెలుస్తోంది. అయితే, కంపెనీ లాభాలు గణనీయంగా పెరుగుతున్న సమయంలోనే ఉద్యోగుల కోతకు సిద్ధం కావడం గమనార్హం.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2025 మూడో త్రైమాసికంలో 3.71 బిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయం కూడా 9 శాతం పెరిగి 20.06 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ గణాంకాలు సంస్థ వ్యాపారం బలంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.

కంపెనీ సీఈఓ స్టీఫెన్‌ స్క్వెరీ మాట్లాడుతూ.. వ్యాపారంలో మంచి వృద్ధి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రత్యర్థులతో పోటీ పాడటానికి వ్యవస్థను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందులో భగంగాంనే.. నిర్వహణ స్థాయిలను తగ్గించడం, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా బాధ్యతల పరిధిని విస్తరించడం వంటి మార్పులను కంపెనీ చేపట్టనుంది. ముఖ్యంగా ఏఐ సాంకేతికత ద్వారా కొన్ని పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే అవకాశం ఉండటంతో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నిర్మాణాన్ని మార్చుకోవాలని భావిస్తోంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కూడా ఏఐని ఉపయోగించుకోవాలని చూస్తోంది. కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆఫర్లు అందించడం, కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాల్లో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. అయితే.. వినియోగదారులు, వ్యాపార భాగస్వాముల సమాచార భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. బార్క్లేస్‌ 5,000 ఉద్యోగాలను, ఈబే సుమారు 1,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలు ప్రకటించగా, వోల్వో కూడా 2,500 ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే.. రానున్న రోజుల్లో ఉద్యోగాల తొలగింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు కష్టకాలం.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement