దేశంలోనే తొలి ఈ-వేస్ట్‌ రహిత జిల్లాగా వయనాడ్‌! | Wayanad Set to Become Indias First E Waste Free District | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ఈ-వేస్ట్‌ రహిత జిల్లాగా వయనాడ్‌!

Nov 1 2026 8:06 AM | Updated on Nov 1 2026 8:06 AM

Wayanad Set to Become Indias First E Waste Free District

కల్పెట్టా: పర్యావరణ పరిరక్షణలో కేరళలోని వయనాడ్‌ జిల్లా అరుదైన ఘనత సాధించనుంది. దేశంలోనే తొలి ఈ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) రహిత జిల్లాగా ఆదివారం (నవంబర్‌ 1) చరిత్ర సృష్టించనుంది. కేరళ పిరవి దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేయనున్నారు. 50 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 80 టన్నుల ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వ్యర్థాలను సేకరించారు. వీటిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచే 31 టన్నులు సేకరించడం విశేషం.

జిల్లా యంత్రాంగం సెప్టెంబర్‌ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్టోబర్‌ 30 నాటికి జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలు ఈ-వేస్ట్‌ రహిత హోదాను సాధించాయి. దేశంలోనే తొలి ఈ-వేస్ట్‌ రహిత గ్రామ పంచాయతీగా నూల్‌పుజ అక్టోబర్‌ 27న గుర్తింపు పొందింది. రెండు విడతల్లో ఈ పంచాయతీ 5,423 కిలోల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించింది. జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వాణిజ్య సంస్థలు, కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

వ్యవసాయ శాఖ మంత్రి టీ. సిద్ధిఖ్‌ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ భూమి ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ-వ్యర్థాల్లో ఉండే సీసం, కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు నేల, నీటి వనరులను కలుషితం చేస్తాయని, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆహార గొలుసులోకి చేరి ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తాయని మంత్రి హెచ్చరించారు. మొత్తం 184 ప్రభుత్వ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రజల్లో అవగాహన కోసం 70కి పైగా పోస్టర్లు, 12 వీడియోలను రూపొందించారు.

సేకరణలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్వచ్ఛత మిషన్‌ నవంబర్‌ 10 వరకు అదనపు గడువు ఇచ్చింది. సేకరణలో తమ ఇళ్లు లేదా సంస్థలు మిగిలిపోయినవారు వయనాడ్‌ కలెక్టరేట్‌లోని 8078409770 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వారికి సమీపంలోని సేకరణ కేంద్రాల్లో వ్యర్థాలను అందజేసేలా సూచిస్తారు. జిల్లా ఈ-వేస్ట్‌ రహితంగా మారిందన్న ప్రకటనను వివిధ సంస్థల ద్వారా తనిఖీ చేసి ధ్రువీకరించనున్నారు.

జిల్లా స్థాయిలో నవంబర్‌ 1న ప్రకటన చేయనున్నప్పటికీ, ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ నవంబర్‌ 20న కల్పెట్టాలో జరిగే భారీ కార్యక్రమంలో అధికారికంగా ఈ-వేస్ట్‌ రహిత జిల్లాగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కృషి చేసిన సంస్థలను సత్కరించనున్నారు. క్లీన్‌ కేరళ కంపెనీ, ఈవై గ్లోబల్‌ డెలివరీ సర్వీసెస్‌, నటుడు మోహన్‌లాల్‌కు చెందిన విశ్వశాంతి ఫౌండేషన్‌, గ్రీన్‌ వర్మ్స్‌, కోనారిస్‌, రాయల్‌ ఎంఆర్‌సీ తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఈ ఘనతను కొనసాగించేందుకు నిరంతర వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ శుద్ధి, రీసైక్లింగ్‌, ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా యంత్రాంగం పేర్కొంది.

ఇదీ చదవండి: జపాన్‌లో భారీ భూకంపం..6.0 తీవ్రత నమోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement