టోక్యో: జపాన్ తీర ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం 3.45 గంటలకు షిమా నగరానికి ఆగ్నేయంగా 58 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది.
భూమికి 352 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. శనివారం రాత్రి 22:15 యూటీసీ సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏడు స్థాయిల భూకంప తీవ్రత కొలమానంపై 3వ స్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మాస్కోలో భారీ దాడి?.. అమెరికా హెచ్చరికతో హై అలర్ట్!


