ఓట్ల పండుగలో భలే ఫీట్లు!
వాషింగ్టన్: అమెరికాలో ఓట్ల పండగ సందడి జోరందుకుంది. ఇంకో రెండు రోజుల్లో మధ్యంతర ఎన్నికలు జరగనుండగా.. అభ్యర్థులు ఓటరు దేవుళ్లకు దండాలు పెట్టడం మొదలుపెట్టేశారు. దండాలతో ఆగితే బాగుండు కానీ.. భారతీయ ఓటర్ల మనసెరిగిన వారేమో తెలియదు కానీ.. కొందరు దోశలతో ఆకట్టుకునేందుకు ప్రయతి్నస్తే.. ఇంకొందరు దేవుడి గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారి చుట్టూ తిరుగుతున్నారు.
అల డల్లాసుపురంలో... భారతీయ అమెరికన్లు అత్యధికంగా ఉండే డల్లాస్‌లో డెమోక్రాట్ల అభ్యర్థి జేమ్స్ టలారికో అక్కడి ఇండియన్ హోటల్‌లో దోశలు వేస్తూ తనకు మద్దతివ్వమని కోరుకున్నారని వార్తలొచ్చాయి. నల్లటి సూట్, తెల్లటి షర్టుతో జేమ్స్ ‘‘వేడి వేడి పెనం మీద ఒక్క గరిటి పిండి...’తో దోసె పోసి పైగా బంగాళా దుంపల కూర కూడా పెట్టి వడ్డించాడట. అది కూడా అరిటాకుపై. ఇంకేముంది.. అక్కడున్న వాళ్లంతో ‘‘భేషో.. భేషు’’ అంటూ కరతాళ ధ్వనులతో అతగాడిని ప్రశంసించేశారు. స్థానిక భారతీయ అమెరికన్లందరూ జేమ్స్ చేసిన పనికి మహా సంతుషు్టలైనట్టు వార్తా సంస్థలు చెబుతున్నాయి. డల్లాసుపురముండే టెక్సస్ రాష్ట్రంలో ఒక వర్గం రిపబ్లికన్ల నుంచి తరచూ జాత్యాహంకార దాడులు జరుగుతూంటాయి.
డల్లాసుపురంలో జేమ్స్ ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెన్ పాక్స్‌టన్. ‘‘జేమ్స్ తనకు అందిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇంకోపక్క పాక్స్‌టన్ తన చుట్టూ ఇన్‌ఫ్లుయెన్సర్లతో తిరుగుతున్నాడు. భారతీయులను స్కామర్లు అంటూ ఉంటాడీయన. భారతీయ వంటకాలు వాసన కొడుతూంటాయని నిందిస్తూంటాడు. భారతీయ టెక్సన్లను బెదిరిస్తూంటాడు. జేమ్స్ మాత్రం సూటు వేసుకుని దోశలేస్తున్నాడు’’ అని జేమ్స్ బ్లంట్ అనే వ్యాపారవేత్త తన ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించాడు. ‘‘ఒక పార్టీ విభజనను వడ్డిస్తూంటే.. ఇంకో పార్టీ దోశలు పంచిపెడుతోంది. వాటి రుచి ఏమో అదిరిపోతోంది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
నారాయణ.. నారాయణ...
భారతీయ అమెరికన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న అమెరికన్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ఇంకో ప్రయత్నం ఆలయ దర్శనం!!! కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామోంట్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనిఫర్ బారహోనాతో కలిసి హాజరయ్యారు. ఇంకోపక్క ఒహాయో కాంగ్రెస్‌మాన్ గ్రెగ్ లాండ్స్‌మాన్ షారోన్ విల్లేలోని బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంలో జరిగిన 11వ పతోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఆలయం ఏర్పాటై 11 ఏళ్లయిన సందర్బంగా ఈ వేడుకలు నిర్వహించారు.
న్యూజెర్సీ సెనేటర్ కోరీ బుకర్ అక్షరధామ్ దేవాలయంలో దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటే కాంగ్రెస్ కోసం పోటీ పడుతున్న రాండీ ఫైన్, స్కాట్ పెరీలు పెన్సెల్వేనియాలోని హ్యారిస్‌బర్గ్ ఆలయ సందర్శన చేపట్టారు. ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి మిషిగన్‌లోని స్వామినారాయణ దేవాలయానికి వెళ్లి ఆలయ సంప్రదాయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అమెరికాలోని హిందూ సమాజం చేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అమెరికాలోని కాలిఫోరి్నయా, టెక్సస్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, ఇల్లినాయి, పెన్సెల్వేనియా, జార్జియాల్లో భారతీయ అమెరికన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. జార్జియా, పెన్సెల్వేనియా, మిషిగన్, నార్ కారొలీనాలలో ఒకట్రెండు శాతం ఓట్లు అటు ఇటు అయినా ఫలితాలు మారిపోతాయి.


