అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. అంతేకాదు ప్రసంగం మధ్యలోనే ఆగి, నీటిలో తడిపిన టిష్యూతో కంటిని తుడుచుకున్నారు. అనంతరం ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘నా కంట్లో ఏదో పడింది.. కొంచెం చూడండి’ అంటూ ట్రంప్ అక్కడ ఉన్న తన స్టాఫ్‌ను కోరారు. కంటిని తుడుచుకున్న తర్వాత ఉపశమనం కలిగిందని, ఐ డ్రాప్స్ ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతేకాదు ఇటీవల కాన్సాస్, అయోవాలో జరగాల్సిన ప్రచార కార్యక్రమాలను కూడా ట్రంప్ తొలుత రద్దు చేయడం ఆయన ఆరోగ్యంపై అనుమానాలకు తావిచ్చింది. అయితే తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అనంతరం ఆ రెండు ర్యాలీలను తిరిగి నిర్వహించారు.
Trump: Do you mind? I got a little thing in my eye. Watch this. *dips towel in water and wipes eye* https://t.co/GSuuDDwIDY
— Acyn (@Acyn) October 31, 2026
కాగా, కంటి సమస్యకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్యం బాగోలేదని కొందరు, మరికొందరు ఆయన వయసు, ఆరోగ్య పరిస్థితిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇక మరోవైపు అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు ట్రంప్‌కు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని 435 స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి: ఎల్‌కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి


