యుద్ధం చేస్తే ఖజానా ఖాళీ అవుతుందనుకుంటున్నారా.. కానీ ట్రంప్ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి! ఇరాన్‌పై నెలల తరబడి సాగుతున్న పోరుకు అమెరికా పెడుతున్న ఖర్చంతా వెనిజులా చమురుతో వెనక్కి వచ్చేసిందట! అంతేకాదు.. పెట్టిన పెట్టుబడికి పది రెట్లు సంపాదించామని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి ఇప్పటివరకు 47 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అంచనాలు వినిపిస్తున్న వేళ.. అసలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? వెనిజులా చమురుకు, ఇరాన్ యుద్ధానికి లింకేంటి? యుద్ధం ముగించేందుకు తొందర లేదంటున్న ట్రంప్ అసలు వ్యూహమేంటి?.. దీనిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఇరాన్‌తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోందని చర్చ జరుగుతున్న వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరాన్ యుద్ధానికి అమెరికా పెద్దగా ఖర్చు చేయడం లేదని చెప్పారు. పైగా యుద్ధం కోసం పెట్టిన డబ్బును వెనిజువెలా ద్వారా ఇప్పటికే పదిరెట్లు సంపాదించామని ప్రకటించారు. అయితే ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల వెనిజులా తమకు 10 లక్షల బ్యారెళ్ల చమురును బహుమతిగా ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. ఇందుకోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో వెనిజువెలాలో అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టి అప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పరిణామాల తర్వాత వెనిజులా చమురు సరఫరాలపై అమెరికా దృష్టి సారించింది. ఇప్పుడు అదే చమురు ఆదాయాన్ని ఇరాన్ యుద్ధ వ్యయంతో ముడిపెడుతూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యుద్ధం ఆపేందుకు తొందర లేదు..
మరోవైపు ఇరాన్ తీవ్ర అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోందని ట్రంప్ చెబుతున్నారు. ఆ దేశం సైనికులకు, పోలీసులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని.. అందుకే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపుతోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ పదేపదే మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇప్పటికే ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతున్నా.. అమెరికాకు మాత్రం తొందర లేదని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ మాటల్లో చర్చల ప్రస్తావన ఉన్నప్పటికీ.. చేతల్లో మాత్రం సైనిక చర్యల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గతవారం మరోసారి 'ఎపిక్ ఫ్యూరీ' తరహా ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. మరోవైపు ఇరాన్‌తో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. అంటే చర్చల తలుపులు తెరిచే ఉంచుతూనే.. సైనిక దాడుల అవకాశాన్నీ సజీవంగా ఉంచుతున్నారన్నమాట.
BREAKING: TRUMP SAYS IRAN WAR COSTS DO NOT MATTER BECAUSE HE MADE SO MUCH MONEY LOOTING VENEZUELA “Any money we've spent in Iran, we've more than made up for with what we did in Venezuela, taking in hundreds of billions of dollars, many, many times.” https://t.co/i6vyC66iic
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) October 30, 2026
పాకిస్థాన్, ఖతార్, టర్కీ.. ఎవరి ప్రయత్నాలు వారివే!
యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రయత్నాలతో ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించారు. అనంతరం జూన్ 17న 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం కుదిరినట్లు కథనం పేర్కొంది. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలు, ఆంక్షల తొలగింపు వంటి అంశాలపై చర్చలు జరిగినా.. శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. సెప్టెంబర్‌లో ఇరాన్ ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అమెరికా దానిని తిరస్కరించింది. అక్టోబర్‌లో ఖతార్ మరో ప్రతిపాదనతో ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తాజాగా టర్కీ కూడా అమెరికాతో చర్చలు జరిపి దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.
అసలు పంతం చమురు కోసమేనా?
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో మొదలైన ఈ యుద్ధం పశ్చిమాసియాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్ ప్రతిదాడులు, హార్మూజ్ జలసంధిలో ఆంక్షలతో ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వెనిజులా చమురు ప్రస్తావనకు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వెనిజులా చమురుతో యుద్ధ ఖర్చుకు పదిరెట్లు రాబడి వచ్చిందని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే అవకాశాలను కూడా తెరిచే ఉంచుతున్నారు. అయితే ఆయన చెబుతున్న చమురు ఆదాయ లెక్కలకు ఇప్పటివరకు ఆధారాలు బయటపెట్టలేదు. చమురు సంపదతో యుద్ధ భారాన్ని తగ్గించుకున్నామని ట్రంప్ చెబుతున్నా.. ఈ పోరుకు ముగింపు ఎప్పుడు? అమెరికా ఖర్చు చేస్తున్న అసలు మూల్యం ఎంత? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హై టెన్షన్.. నెతన్యాహు ఇంటి వద్ద ఉద్రిక్తత


