breaking news
venezeula
-
ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన.. మొట్టమొదటిది కావడం గమనార్హం. In his Truth Social post, US President Donald Trump recognises himself as the 'Acting President of Venezuela' pic.twitter.com/A23DlWqIBw— ANI (@ANI) January 12, 2026డ్రగ్స్ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్లను బంధించి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.మదురో అక్రమ అరెస్ట్ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు. ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది. గతంలో.. గతంలో కొందరు నాయకులు తమ దేశానికి రాజులుగా, అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. నెపోలియన్ బోనపార్టే(ఫ్రాన్స్), అహ్మత్ జోగ్(అల్బేనియా), బోరిస్ స్కోసిరెఫ్(అండోరా).. ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ చరిత్రలోనే.. ఇలా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశంపై అధికారాన్ని ప్రకటించుకున్న దాఖలాలైతే లేవు(మీ దృష్టిలో ఏదైనా ఉంటే.. సోషల్ మీడియాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు). కాబట్టి ట్రంప్ ప్రకటన అత్యంత అరుదైనదిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటనపై వెనెజువెలా ప్రభుత్వం, ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
నికోలస్ మదురో అరెస్ట్.. అసలేంటి 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'?
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక దేశ అధ్యక్షుడిని నేరుగా ఇంటికెళ్లి బంధించడం అగ్రరాజ్యానికే సాధ్యమైంది. అయితే ఈ పరిణామాల తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మరికొన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. ట్రంప్ చర్యలను కొందరు సమర్థించారు. అసలు మదురోను అమెరికా ఎందుకు నిర్భంధించింది. దీని వెనుక కారణాలేంటో తెలుసుకుందాం.అమెరికా ముఖ్యంగా తమ దేశానికి డ్రగ్స్ సరఫరా కాకుండా అడ్డుకోవడమేనని చెబుతోంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే చాలాసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో ఏకంగా అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలిచింది.అసలేంటి 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'..నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయనపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసినట్లు విచారణ చేసి శిక్షిస్తామని అగ్రరాజ్యం అంటోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'కు మదురో నాయకత్వం వహించారని ప్రధాన ఆరోపణ. ఈ ముఠా ద్వారా కొలంబియాకు చెందిన తీవ్రవాదులతో చేతులు కలిపి అమెరికాకు భారీగా కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు అభియోగాలున్నాయి. ఆయుధాల సరఫరా, మనీ లాండరింగ్ వంటి నార్కో-టెర్రరిజం నేరాల్లో మదురో హస్తం ఉందని న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదయ్యాయి.నికోలస్ మదురోపై కొనసాగుతున్న మాదకద్రవ్య అక్రమ రవాణా కేసులో 'కార్టెల్ ఆఫ్ ది సన్స్' కీలకంగా మారింది. ఇది వ్యవస్థీకృత ముఠా కాదు... వెనిజులా సైనిక అధికారులలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్న నెట్‌వర్క్‌కు మదురో నాయకత్వం వహించాడని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవస్థ కింద, సైనిక, ప్రభుత్వ అధికారులు లాభం కోసం కొకైన్ సరుకులను తరలించడానికి తమ అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సినలోవా కార్టెల్, ట్రెన్ డి అరగువా వంటి డ్రగ్ ముఠాలను రక్షించడానికి మదురో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ రవాణాదారులకు దౌత్య పాస్‌పోర్ట్‌లను విక్రయించాడని తెలుస్తోంది.మదురో భార్యపై ఆరోపణలుకొకైన్ అక్రమ రవాణాను రక్షించడానికి వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ లంచాలు తీసుకున్నారని అమెరికా ఆరోపించింది. 2007లో ఒక అక్రమ రవాణాదారుడు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార అధిపతి మధ్య సమావేశాలను ఏర్పాటు చేయడానికి ఆమె లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సైనిక మాదకద్రవ్యాల ప్రమేయంపై దర్యాప్తు 1990ల ప్రారంభం నుంచే కొనసాగుతోందని యూఎస్ అధికారులు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తరువాత నికోలస్ మదురో హయాంలో.. అక్రమ మైనింగ్, ఇంధన అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి నేరాలకు నెట్వర్క్ విస్తరించిందని అంటున్నారు. -
మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలోనే వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో కూడా పయనించారు. తమ దేశంలో అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటును రద్దుచేస్తున్నట్లు అత్యవసర డిక్రీ జారీచేశారు. కొలంబియాలో భారీ ఎత్తున మాఫియా వర్గాలు ఈ నోట్లను నిల్వ చేశాయని, ఆ మాఫియాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని మదురో ప్రకటించారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ విలువైన కొత్త నోట్లు, నాణేలను విడుదల చేసేందుకు వెనిజులా సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటుకు మూడు సెంట్ల కంటే తక్కువ విలువ ఉంది. ఒక హాంబర్గర్ కొనాలంటే 100 బొలివర్ నోట్లు 50 కావాల్సి ఉంటుంది. అంతలా దాని విలువ ఇటీవలి కాలంలో పడిపోయింది. తనకున్న రాజ్యాంగ అధికారాలతో, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితిలో 100 బొలివర్ బిల్‌ను చలామణిలోంచి తప్పించాలని నిర్ణయించినట్లు మదురో ప్రకటించారు. రాబోయే 72 గంటల పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయని 'కాంటాక్ట్ విత్ మదురో' అనే తన టీవీ షోలో ఆయన తెలిపారు. వందలకోట్ల కొద్దీ నోట్లను అంతర్జాతీయ మాఫియా ప్రధానంగా కొలంబియా నగరాలతో పాటు బ్రెజిల్లో కూడా దాచిపెట్టిందని, కొన్ని జాతీయ బ్యాంకులకు కూడా ఈ కుట్రలో భాగం ఉందని వెనిజులా అధ్యక్షుడు మదురో చెప్పారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరత పాలు చేయడానికి వీళ్లంతా ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలోకి వచ్చే అన్ని భూ, విమాన, సముద్ర మార్గాలను మూసేస్తున్నామని.. ఆ నోట్లను వాళ్లు మళ్లీ ఇక్కడకు తేకుండా ఉండటానికే ఇలా చేస్తున్నామని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ నోట్లను రద్దుచేయడం సరికాదని, రిజర్వు బ్యాంకుకు మరింత పెద్దనోట్లు ముద్రించేందుకు తగినంత సమయం ఇచ్చి ఉండాల్సిందని వెనిజులా రిజర్వు బ్యాంకు మాజీ డైరెక్టర్, ప్రస్తుత విపక్ష సభ్యుడు జోస్ గువెరా అన్నారు. చమురు ఎగుమతులు కూడా పడిపోవడం వల్ల దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిండుకుంటోంది. దీంతో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల దిగుమతి కష్టం అవుతోంది. ఈ సంవత్సరాంతానికి అక్కడ ద్రవ్యోల్బణం 475 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.


