వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక దేశ అధ్యక్షుడిని నేరుగా ఇంటికెళ్లి బంధించడం అగ్రరాజ్యానికే సాధ్యమైంది. అయితే ఈ పరిణామాల తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మరికొన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. ట్రంప్ చర్యలను కొందరు సమర్థించారు. అసలు మదురోను అమెరికా ఎందుకు నిర్భంధించింది. దీని వెనుక కారణాలేంటో తెలుసుకుందాం.
అమెరికా ముఖ్యంగా తమ దేశానికి డ్రగ్స్ సరఫరా కాకుండా అడ్డుకోవడమేనని చెబుతోంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే చాలాసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో ఏకంగా అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలిచింది.
అసలేంటి 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'..
నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయనపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసినట్లు విచారణ చేసి శిక్షిస్తామని అగ్రరాజ్యం అంటోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్ 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'కు మదురో నాయకత్వం వహించారని ప్రధాన ఆరోపణ. ఈ ముఠా ద్వారా కొలంబియాకు చెందిన తీవ్రవాదులతో చేతులు కలిపి అమెరికాకు భారీగా కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు అభియోగాలున్నాయి. ఆయుధాల సరఫరా, మనీ లాండరింగ్ వంటి నార్కో-టెర్రరిజం నేరాల్లో మదురో హస్తం ఉందని న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదయ్యాయి.
నికోలస్ మదురోపై కొనసాగుతున్న మాదకద్రవ్య అక్రమ రవాణా కేసులో 'కార్టెల్ ఆఫ్ ది సన్స్' కీలకంగా మారింది. ఇది వ్యవస్థీకృత ముఠా కాదు... వెనిజులా సైనిక అధికారులలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్న నెట్‌వర్క్‌కు మదురో నాయకత్వం వహించాడని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవస్థ కింద, సైనిక, ప్రభుత్వ అధికారులు లాభం కోసం కొకైన్ సరుకులను తరలించడానికి తమ అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సినలోవా కార్టెల్, ట్రెన్ డి అరగువా వంటి డ్రగ్ ముఠాలను రక్షించడానికి మదురో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ రవాణాదారులకు దౌత్య పాస్‌పోర్ట్‌లను విక్రయించాడని తెలుస్తోంది.
మదురో భార్యపై ఆరోపణలు
కొకైన్ అక్రమ రవాణాను రక్షించడానికి వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ లంచాలు తీసుకున్నారని అమెరికా ఆరోపించింది. 2007లో ఒక అక్రమ రవాణాదారుడు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార అధిపతి మధ్య సమావేశాలను ఏర్పాటు చేయడానికి ఆమె లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సైనిక మాదకద్రవ్యాల ప్రమేయంపై దర్యాప్తు 1990ల ప్రారంభం నుంచే కొనసాగుతోందని యూఎస్ అధికారులు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తరువాత నికోలస్ మదురో హయాంలో.. అక్రమ మైనింగ్, ఇంధన అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి నేరాలకు నెట్‌వర్క్ విస్తరించిందని అంటున్నారు.


