breaking news
nicolus maduro
-
అక్షరాలా ఊచకోతే!
వాషింగ్టన్: అమెరికా ఇటీవల వెనెజువెలా రాజధాని కారకస్‌పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను సతీసమేతంగా నిర్బంధించడం, న్యూయార్క్‌కు మెరుపువేగంతో తరలించిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్, తరలింపు ఆపరేషన్‌ను అగ్రరాజ్యం కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆ సందర్భంగా మదురో అంగరక్షకులను, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అక్షరాలా ఊచకోతే కోశాయట! రంగంలోకి దిగింది కేవలం 20 మందే అయినా వందలాది మంది రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ అమెరికా అధికార భవనం వైట్‌హౌస్ ప్రెస్ మహిళా సెక్రెటరీ కరోలిన్ లెవిట్ శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నా సరే, అర్జెంటుగా ఆపేసి ఇదోసారి చదవండి...’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డు ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. ‘‘అంతా హఠాత్తుగా మొదలైంది. ఉన్నట్టుండి మా రాడార్ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదుగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటినుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలామందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యా బలం ఎందుకూ కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచీ వారు అక్షరాలా ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకుమించిన కచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరూ నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు.జీవాయుధమా?దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామె న్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ‘‘ ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు నా తల బద్దలవుతుందా అనిపించింది. మా ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయాం. మాలో వందల మందిని పొట్టన పెట్టుకున్నారు’’ అని వివరించారు. ‘‘అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్ అమెరికా దేశాలన్నింటికీ ఒకటే చెబుతున్నా. అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకసలు ఏమీ తెలియదు’’ అంటూ సదరు గార్డు హెచ్చరికలు కూడా చేయడం విశేషం. -
నికోలస్ మదురో అరెస్ట్.. అసలేంటి 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'?
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక దేశ అధ్యక్షుడిని నేరుగా ఇంటికెళ్లి బంధించడం అగ్రరాజ్యానికే సాధ్యమైంది. అయితే ఈ పరిణామాల తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మరికొన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. ట్రంప్ చర్యలను కొందరు సమర్థించారు. అసలు మదురోను అమెరికా ఎందుకు నిర్భంధించింది. దీని వెనుక కారణాలేంటో తెలుసుకుందాం.అమెరికా ముఖ్యంగా తమ దేశానికి డ్రగ్స్ సరఫరా కాకుండా అడ్డుకోవడమేనని చెబుతోంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే చాలాసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో ఏకంగా అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలిచింది.అసలేంటి 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'..నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయనపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసినట్లు విచారణ చేసి శిక్షిస్తామని అగ్రరాజ్యం అంటోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'కు మదురో నాయకత్వం వహించారని ప్రధాన ఆరోపణ. ఈ ముఠా ద్వారా కొలంబియాకు చెందిన తీవ్రవాదులతో చేతులు కలిపి అమెరికాకు భారీగా కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు అభియోగాలున్నాయి. ఆయుధాల సరఫరా, మనీ లాండరింగ్ వంటి నార్కో-టెర్రరిజం నేరాల్లో మదురో హస్తం ఉందని న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదయ్యాయి.నికోలస్ మదురోపై కొనసాగుతున్న మాదకద్రవ్య అక్రమ రవాణా కేసులో 'కార్టెల్ ఆఫ్ ది సన్స్' కీలకంగా మారింది. ఇది వ్యవస్థీకృత ముఠా కాదు... వెనిజులా సైనిక అధికారులలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్న నెట్‌వర్క్‌కు మదురో నాయకత్వం వహించాడని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవస్థ కింద, సైనిక, ప్రభుత్వ అధికారులు లాభం కోసం కొకైన్ సరుకులను తరలించడానికి తమ అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. సినలోవా కార్టెల్, ట్రెన్ డి అరగువా వంటి డ్రగ్ ముఠాలను రక్షించడానికి మదురో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ రవాణాదారులకు దౌత్య పాస్‌పోర్ట్‌లను విక్రయించాడని తెలుస్తోంది.మదురో భార్యపై ఆరోపణలుకొకైన్ అక్రమ రవాణాను రక్షించడానికి వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ లంచాలు తీసుకున్నారని అమెరికా ఆరోపించింది. 2007లో ఒక అక్రమ రవాణాదారుడు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార అధిపతి మధ్య సమావేశాలను ఏర్పాటు చేయడానికి ఆమె లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సైనిక మాదకద్రవ్యాల ప్రమేయంపై దర్యాప్తు 1990ల ప్రారంభం నుంచే కొనసాగుతోందని యూఎస్ అధికారులు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తరువాత నికోలస్ మదురో హయాంలో.. అక్రమ మైనింగ్, ఇంధన అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి నేరాలకు నెట్వర్క్ విస్తరించిందని అంటున్నారు. -
మరో మూడు దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వెనెజువెలాకు చుక్కలు చూపింది. అనంతరం.. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్క్‌కు తరలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడే వారికి ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. ఇదే సమయంలో లాటిన్ అమెరికా దేశాలను ట్రంప్ హెచ్చరించారు.మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోవతే వారిపై తగిన చర్యలు, దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.మెక్సికోపై ఆరోపణలు: దేశం కార్టెల్ల చేతిలో నడుస్తోందని, అమెరికా జోక్యం అవసరమని అన్నారు.కొలంబియాపై ఇలా: కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. మూడు ప్రధాని కొకైన్ ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. కొకైన్‌ను అమెరికాలోకి సరఫరా చేస్తున్నారు. అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.క్యూబాపై తీవ్ర విమర్శలు: విఫలమవుతున్న దేశం అని అన్నారు. క్యూబా ప్రజలను అమెరికా ఆదుకుంటుంది. అమెరికా సైనిక చర్యలు జరగవచ్చని అని సూచించారు.ఇదిలా ఉండగా.. వెనెజువెలా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.లాటిన్ అమెరికా దేశాలే టార్గెట్.. మరోవైపు.. బ్రిటిష్ పాలన నుంచి 1776లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అమెరికా.. ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కు పిడికిలి బిగించింది. 1798 మొదలు తాజాగా వెనెజువెలా ఉదంతం వరకు 700లకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధి నేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగానికి పాల్పడింది. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 65వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. అదృశ్యమైన వ్యక్తులు, లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉంది. -
డబ్బుల కోసం నిరసనలు.. లూటీలు!
పెద్దనోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న పాట్లు మన దేశంలో కంటే వెనిజులాలో మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక జనం డెలివరీ ట్రక్కులను దోచుకుంటున్నారు, పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. రద్దు చేసిన 100 బొలివర్ నోట్ల స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. కానీ ఇప్పటివరకు నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అసలే ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొత్త నోట్లు ఇంకా సిద్ధం కాకముందే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఆయన ప్రకటించే సమయానికి 100 బొలివర్ విలువ మూడు సెంట్లు (అమెరికా కరెన్సీలో) మాత్రమే. వెనిజులాలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో అవే 77 శాతం వరకు ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తుండటం, తమ వాళ్ల కోసం బహుమతులు కాదు కదా.. కనీసం ఆహారం కొనుక్కోడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మరకైబో నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అలాగే మటురిన్ నగరంలో ఒక పెద్ద మాల్‌ను డజన్ల కొద్దీ ప్రజలు దోచుకున్నారు. తాను చూస్తుండగానే ఒక చికెన్ ట్రక్కును కొందరు దోచుకున్నారని మటురిన్ నగరానికి చెందిన జువాన్ కార్లోస్ లీల్ అనే రైతు చెప్పారు. డబ్బు తీసుకుందామని బ్యాంకులకు వెళ్లిన జనం, అక్కడ వారికి దొరక్కపోవడంతో దోపిడీలకు పాల్పడుతున్నారని ప్యూర్టో లా క్రజ్ అనే బేకరీ వ్యాపారి తెలిపారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం దుకాణాలు మూయించేశారు. ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్లో చెబుతున్నారు. శాంటా బార్బరా నగరంలో డబ్బు తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది వ్యక్తులు దోచుకోడానికి ప్రయత్నిస్తుంటే, దాని డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం కేవలం ఆ దేశ రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను తీసుకుంటుండటంతో.. అక్కడ వేలాది మంది క్యూలు కడుతున్నారు. ఇప్పటికైతే వాటిని కేవలం డిపాజిట్ చేయించుకుని, వాటి బదులు 'ప్రత్యేక ఓచర్లు' ఇస్తున్నారే తప్ప కొత్తనోట్లు ఇవ్వడంలేదు. ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపిస్తోందని, ఆహారం కొనడానికి డబ్బులు లేవని జీసస్ గారికా అనే కూరగాయల వ్యాపారి చెప్పారు.


