డబ్బుల కోసం నిరసనలు.. లూటీలు! | Venezuela cash crisis sparks looting, protests | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం నిరసనలు.. లూటీలు!

Dec 17 2016 11:21 AM | Updated on Sep 27 2018 9:11 PM

పెద్దనోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న పాట్లు మన దేశంలో కంటే వెనిజులాలో మరింత దారుణంగా ఉన్నాయి.

 
పెద్దనోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న పాట్లు మన దేశంలో కంటే వెనిజులాలో మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక జనం డెలివరీ ట్రక్కులను దోచుకుంటున్నారు, పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. రద్దు చేసిన 100 బొలివర్ నోట్ల స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. కానీ ఇప్పటివరకు నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అసలే ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొత్త నోట్లు ఇంకా సిద్ధం కాకముందే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఆయన ప్రకటించే సమయానికి 100 బొలివర్ విలువ మూడు సెంట్లు (అమెరికా కరెన్సీలో) మాత్రమే. వెనిజులాలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో అవే 77 శాతం వరకు ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తుండటం, తమ వాళ్ల కోసం బహుమతులు కాదు కదా.. కనీసం ఆహారం కొనుక్కోడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. 
మరకైబో నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అలాగే మటురిన్ నగరంలో ఒక పెద్ద మాల్‌ను డజన్ల కొద్దీ ప్రజలు దోచుకున్నారు. తాను చూస్తుండగానే ఒక చికెన్ ట్రక్కును కొందరు దోచుకున్నారని మటురిన్ నగరానికి చెందిన జువాన్ కార్లోస్ లీల్ అనే రైతు చెప్పారు. డబ్బు తీసుకుందామని బ్యాంకులకు వెళ్లిన జనం, అక్కడ వారికి దొరక్కపోవడంతో దోపిడీలకు పాల్పడుతున్నారని ప్యూర్టో లా క్రజ్ అనే బేకరీ వ్యాపారి తెలిపారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం దుకాణాలు మూయించేశారు. ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్‌లో చెబుతున్నారు. 
 
శాంటా బార్బరా నగరంలో డబ్బు తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది వ్యక్తులు దోచుకోడానికి ప్రయత్నిస్తుంటే, దాని డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం కేవలం ఆ దేశ రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను తీసుకుంటుండటంతో.. అక్కడ వేలాది మంది క్యూలు కడుతున్నారు. ఇప్పటికైతే వాటిని కేవలం డిపాజిట్ చేయించుకుని, వాటి బదులు 'ప్రత్యేక ఓచర్లు' ఇస్తున్నారే తప్ప కొత్తనోట్లు ఇవ్వడంలేదు. ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపిస్తోందని, ఆహారం కొనడానికి డబ్బులు లేవని జీసస్ గారికా అనే కూరగాయల వ్యాపారి చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement