భారత్‌తో డీల్‌ కుదిరింది: డొనాల్డ్‌ ట్రంప్‌ | Donald Trump Confirmed India Venezuela Oil Deal | Sakshi
Sakshi News home page

భారత్‌తో డీల్‌ కుదిరింది: డొనాల్డ్‌ ట్రంప్‌

Feb 1 2026 11:08 AM | Updated on Feb 1 2026 11:24 AM

Donald Trump Confirmed India Venezuela Oil Deal

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాం ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌.. ఇకపై వెనెజువెలా నుంచి చేసుకునేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం ఫ్లోరిడాకు వెళ్తున్న క్రమంలో.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్‌ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్‌ కూడా చేరనుంది. భారత్‌ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం’’ అని ట్రంప్‌ తెలిపారు. అలాగే వెనెజువెలా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. దీనిపై భారత్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

మరోవైపు వెనెజువెలాలో పాలనపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందన్నారు. తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు.

వెనెజువెలాపై సైనిక దాడి చేసి.. ఆ దేశ నేత నికోలస్‌ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 

భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుంచి లక్షల బ్యారెల్ల చమురు దిగుమతి చేసుకునేది. ఒనానొక టైం వచ్చేసరికి.. ఆ దేశం మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వరకు భారతదేశం వాటా కలిగి ఉండేది. అయితే, 2010 చివర్లో.. అమెరికా వెనెజువెలాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో.. ద్వితియ శ్రేణి ఆంక్షలు(Secondary Sanctions) భయంతో భారత్‌కు చెందిన కంపెనీలు కొనుగోళ్లను తగ్గించాయి, ఫలితంగా వెనిజులా చమురు దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. 

అదే సమయంలో.. అమెరికా ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఇంతకాలం భారత్‌ ఇరాన్‌ నుంచి కాస్తకూస్తో చమురు దిగుమతులను చేసుకునేది. అయితే ఈమధ్యే భారత ప్రధాని మోదీ - వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్జ్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు కూడా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement