న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకున్న కొందరు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఏఐ సలహాను పాటించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యుడిని సంప్రదించకుండా ఒక ఏఐ చాట్ ప్లాట్‌ఫామ్ ఇచ్చిన సలహాతో హెచ్‌ఐవీ నిరోధక మందులు వాడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. లైంగిక సంబంధం తర్వాత హెచ్‌ఐవీ సోకుతుందనే భయంతో, అతను ముందు జాగ్రత్తగా ఏఐ సలహాతో కొన్ని మందులను వాడాడు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు తీసుకోవడం వల్ల అతనికి 'స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్' అనే అరుదైన, ప్రాణాంతక చర్మ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో అతను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఏఐ సూచనలతో స్థానిక కెమిస్ట్ షాపు నుండి ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే 28 రోజుల కోర్సును కొనుగోలు చేశాడు. ఈ మందులను ఏడు రోజుల పాటు వాడిన తర్వాత, అతని శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది.
ఆరోగ్య పరిస్థితి విషమించి, అతనికి కంటి సమస్యలు ఇతర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన అనంతరం చివరకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, డ్రగ్ రియాక్షన్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యులు తెలిపారు. జాతీయ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌ఐవీ నిరోధక మందులను వైద్యుల క్షుణ్ణమైన పరిశీలన, రిస్క్ అసెస్‌మెంట్, బేస్‌లైన్ పరీక్షల తర్వాతే అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఎటువంటి పర్యవేక్షణ లేకుండా యాంటీ రిట్రోవైరల్ మందులు వాడటం వల్ల శరీర అవయవాలు దెబ్బతినడం, చివరికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాధనాలు కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవని, అవి ఎప్పటికీ వైద్యుని క్లినికల్ నిర్ణయానికి ప్రత్యామ్నాయం కాబోవని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ జోక్యాన్ని పరిమితం చేసేలా ప్రభుత్వం తగిన ప్రమాణాలను తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రతిష్టంభనకు చెక్.. సంతకాలే తరువాయి..


