న్యూఢిల్లీ: భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. చర్చల్లో ప్రతిష్టంభన కలిగించే అంశాలేవీ ఇంకా మిగిలి లేవని, ఇరు దేశాలు త్వరలోనే ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని ఆయన ‘హిందుస్థాన్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
గతంలో భారత్ తాను అనుసరించిన రక్షణాత్మక వైఖరిని వీడి, ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చలు జరుపుతోందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్- ఐరోపా సమాఖ్య (ఈయూ)మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)చర్చలు విజయవంతంగా ముగిసిన మూడు రోజులకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలోనే అమెరికా- భారత్‌ల ఒప్పందం చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. జర్మనీ ఛాన్సలర్ వంటి ప్రముఖ నేతలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారని, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత మార్కెట్‌ను నిర్మించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయన్నారు.
కాగా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేపడుతున్న చర్యలను ఐరోపా సమాఖ్య గుర్తించిందని, కార్బన్ పన్ను వంటి అంశాల్లో భారత్‌కు తగిన మద్దతు లభిస్తున్నదని గోయల్ అన్నారు. భారతీయ నిపుణుల వలసలు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడిన ఆయన.. భారత్ ఎప్పుడూ చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే నైపుణ్యం కలిగిన భారతీయుల కోసం ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. భారతీయులు చట్టాలను గౌరవిస్తారనే మంచి పేరు అంతర్జాతీయంగా ఉందని గోయల్ అన్నారు.
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు బలమైన శక్తిగా ఎదిగిందని పీయూష్ గోయల్ అన్నారు. మనం ఇప్పుడు వర్తమాన ఆర్థిక స్థితి గురించి కాకుండా, 2047 నాటికి భారత్ చేరుకోబోయే 30 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. వస్త్ర పరిశ్రమ, తయారీ రంగం,సేవా రంగాల్లో ఎగుమతులను గణనీయంగా పెంచడం ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?


