దేశంలోని పలు నగరాల్లో నడక అనేది అంతకంతకూ ఒక సాహసకృత్యంగా మారిపోతోంది. కాలుష్యం, దుమ్ము ధూళి మధ్య పాదచారులు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కును కల్పిస్తున్నప్పటికీ, సురక్షితంగా నడిచే హక్కు మాత్రం నేటికీ అందని ద్రాక్షగానే ఉంది. మన నగరాల్లో ఫుట్‌పాత్‌లు అస్తవ్యస్తంగా ఉండటమే కాకుండా, అనేక చోట్ల అవి అసలు ఉనికిలోనే లేవు. నావిగేషన్ యాప్‌లు నడక మార్గాలను సూచిస్తున్నప్పటికీ, అవి భద్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరాల్లో ఫుట్‌పాత్‌ల దుస్థితి పాదచారులను నిత్యం ప్రమాదపు అంచుల్లో నెట్టివేస్తోంది.
మౌలిక సదుపాయాల కొరత
దేశంలో పలు వ్యాధుల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వ్యాయామం కోసం కనీసం 10 వేల అడుగులు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, మన నగరాల రూపకల్పన ఇందుకు ఏమాత్రం అనువుగా లేదు. లండన్, న్యూయార్క్ తదితర అంతర్జాతీయ నగరాల్లో పాదచారుల మౌలిక సదుపాయాలను ప్రాథమిక అవసరాలుగా గుర్తించారు. భారత్‌లో మాత్రం వీటిని విస్మరిస్తున్నారు. ముంబై లాంటి మెట్రో నగరాలు కూడా వాకబిలిటీ ఇండెక్స్‌లో అట్టడుగున ఉండటం గమనార్హం. కేవలం వాహనాల రాకపోకల ఆధారంగానే రోడ్ల ఇంజనీరింగ్ జరుగుతోందని, మనుషుల భద్రతను పట్టించుకోవడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు దాటాలంటే ప్రాణగండమే..
మనదేశంలోని పలు నగరాల్లో రోడ్డు దాటుతూ, లేదా రోడ్డుపై నడుస్తూ మరణిస్తున్నవారి గణాంకాలు వింటే ఒళ్లు జలదరిస్తుంది. 2023లో భారత్‌లో సుమారు 1,72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, అందులో ఐదవ వంతు పాదచారులే ఉండటం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ క్షేత్రాల్లో జరిగే మరణాల కంటే భారతీయ రహదారులపై పాదచారుల మరణాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 1.8 మీటర్లు, వాణిజ్య ప్రాంతాల్లో 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్‌పాత్‌లు ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. తెరిచి ఉంచిన మురుగు కాలువలు, నాణ్యత లేని ఫ్లాట్ ఫారాలు పాదచారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.
పరిష్కార మార్గాలు.. భవిష్యత్తు సవాళ్లు
పాదచారుల సమస్యను పరిష్కరించడానికి కొన్ని నగరాల్లో ప్రయోగాత్మక చర్యలు చేపట్టినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. బెంగళూరులోని 'టెండర్ ష్యూర్' వంటి ప్రాజెక్టులు కొంత ఆశాజనకంగా ఉన్నా, నిధుల కొరత, రాజకీయ సంకల్పం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఫుట్‌పాత్‌లను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించి, పాదచారులకు ప్రాధాన్యతనిచ్చే 15-మినిట్ సిటీ వంటి అంతర్జాతీయ నమూనాలను మనం అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒక నగర నివాసికి అవసరమైన ప్రాథమిక అవసరాలన్నీ (ఆహారం, విద్య, వైద్యం, ఉద్యోగం, వినోదం) తమ ఇంటికి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంతో చేరుకోగలిగేలా నగరాలు ఉండాలి.
ఇది కూడా చదవండి: మైకుల్లో కాదు ‘మెటా’లో..


