పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అప్పుడే తమ పోరాట క్షేత్రాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ వేదికలకు తరలించాయి. ‘మెటా’, గూగుల్ యాడ్ ట్రాన్స్‌పరెన్సీ లైబ్రరీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇటీవల ‘ఇండియా టుడే’ బృందం విశ్లేషించింది. ఈ నివేదికలోని వివరాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి జనవరి 16 మధ్య సాగిన డిజటల్ యుద్ధం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
నెల రోజులకు రూ. 6.38 కోట్లు
గడచిన నెల రోజుల వ్యవధిలో బెంగాల్‌లోని రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్‌లలో ప్రకటనల కోసం ఏకంగా రూ. 6.38 కోట్లు వెచ్చించాయి. ఈ డిజిటల్ ప్రకటనల ఖర్చుల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రధాని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రకటనల్లో టీఎంసీ జోరు
తృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహకర్త ‘ఐ-ప్యాక్’ (ఐ-పాక్)తో కలిసి గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల కోసం గత నెలలో సుమారు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసింది. కేవలం అధికారిక పేజీలే కాకుండా.. ‘అబర్ జీత్బే బంగ్లా’, ‘అమీ బంగ్లార్ డిజిటల్ జోద్ధా’ లాంటి పలు సరోగెట్ (అప్రత్యక్ష) పేజీల ద్వారా మరో రూ. 32 లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది.
మమతా బెనర్జీకి అనుకూలంగా..
ఈ పేజీలలో పార్టీ గుర్తును నేరుగా వాడకపోయినప్పటికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘బోల్చే బంగ్లా’ లాంటి పేజీలు ఒకడుగు ముందుకు వేసి, బీజేపీపై పలు విమర్శలు చేస్తూ, ఇందుకు ప్రయాగ్‌రాజ్ మాఘ మేళా వీడియోలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీపై వ్యూహాత్మక దాడులకు దిగాయి.
అధికారిక ప్రచారంలో బీజేపీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెటాపై రూ. 72 లక్షలు, గూగుల్‌పై రూ. 63 లక్షలు వెచ్చించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి సరోగెట్ పేజీల కంటే అధికారిక ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా తమ పథకాల ప్రచారం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నెల రోజుల్లో రూ. 2.1 కోట్లు ఖర్చు చేసింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ సుమారు రూ. 19 లక్షలు వెచ్చించింది.
బెంగాల్ కోటలో సమరభేరి
దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారం సాగించడంలో బీజేపీకి తిరుగులేకపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌ను మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి గణాంకాలను పరిశీలించినా టీఎంసీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రచార శైలిని చూస్తే, టీఎంసీ గూగుల్ యాడ్స్ ద్వారా విధానపరమైన ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బీజేపీ ‘మెటా’ వేదికలపై భావోద్వేగపూరిత అంశాలను ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుండగా, పటిష్టమైన వ్యూహాలతో టీఎంసీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.
ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్


