గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్‌కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.
“ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్ షా అన్నారు.
ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది?
మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు.


