ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త మేయర్‌ను ఎప్పుడు ఎన్నుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవలి పౌర ఎన్నికల్లో బీజేపీ- ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే తమ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ, ముంబైలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం అధికార బీజేపీ- ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గాలు కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తమ గ్రూపు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయకపోవడమేనని సమాచారం.
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంబై మున్సిపల్ సెక్రటేరియట్‌లో తదుపరి చర్యలు చేపడతారు. నిబంధనల ప్రకారం, గ్రూపు రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. గ్రూపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం మేయర్ పదవులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ, పౌర యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మూడు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ పత్రాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రకారం, ఈసారి ముంబై మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మేయర్ రేసులో నిలిచే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా కార్పొరేటర్లు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రైల్వేకు షాక్.. విద్యార్ధినికి రూ. 9 లక్షల పరిహారం


