T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే | With T20 WC medal Shivam Dube reveals how he returned home via train | Sakshi
Sakshi News home page

T20 WC 2026: రైలులో 3rd ఏసీ ప్రయాణం.. అలా ముంబై చేరుకున్నా: శివం దూబే

Mar 11 2026 5:15 PM | Updated on Mar 11 2026 6:04 PM

With T20 WC medal Shivam Dube reveals how he returned home via train

టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.

ఇక ఈ టోర్నీలో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్‌ ఖాన్‌తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.

3rd ఏసీ టికెట్లు దొరికాయి
‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్‌ చేసుకున్నాం.

నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్‌ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.

అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.

పోలీసులకు ముందుగానే సమాచారం
అందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్‌లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్‌ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.

నాలుగేళ్ల కుమారుడు అయాన్‌, రెండేళ్ల కుమార్తె మెవిష్‌లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్‌ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్‌ హీరో ట్రైన్‌లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.

చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement