టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌ | Gautam Gambhir Hits Back At Kirti Azad Over Remarks On Team India T20 World Cup Celebration, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

టీమిండియా సిగ్గుపడు!.. భారత మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌

Mar 11 2026 2:41 PM | Updated on Mar 11 2026 3:39 PM

Gambhir Befitting Reply To Kirti Azad Comments T20 WC Remarks

భారత మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడతారని.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవడంలో అర్థం లేదన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. తద్వారా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఐసీసీ చైర్మన్‌ జై షా స్టేడియానికి సమీపంలో ఉన్న హనుమాన్‌ ఆలయాన్ని దర్శించారు.

కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ‘‘టీమిండియా సిగ్గుపడు!.. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచినపుడు.. ఆ జట్టులో హిందు, ముస్లిం, సిక్కు ఉన్నారు. నాడు మేము ఆ ట్రోఫీని మాతృభూమి భారత్‌=హిందుస్థాన్‌= ఇండియాకు తీసుకువచ్చాము.

కానీ ఇప్పటి క్రికెట్‌ జట్టు ట్రోఫీని ఎందుకిలా చేస్తోంది. మసీదు లేదంటే చర్చి లేదంటే గురుద్వారకు తీసుకువెళ్లవచ్చు కదా!.. ఈ జట్టు ఇండియా మొత్తానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇదేమీ సూర్యకుమార్‌ యాదవ్‌ లేదంటే జై షా కుటుంబానికి చెందినది కాదు.

సిరాజ్‌ ఎప్పుడూ ట్రోఫీని మసీదుకు తీసుకువెళ్లలేదు. విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ చర్చికి తీసుకువెళ్లలేదు. ఇది 140 కోట్ల భారతీయులకు చెందినది. అంతేగానీ ఓ మతానికి చెందినది కాదు’’ అని కీర్తి ఆజాద్‌ పోస్టు చేశాడు.

 ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు
ఈ విషయంపై స్పందించాల్సిందిగా ANI గంభీర్‌ను కోరగా.. ‘‘అలాంటి వాళ్ల మాటలకు స్పందించడం కూడా దండగే. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అతి పెద్ద సంబరం ఇది. వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన జట్టును అందరూ అభినందిస్తున్నారు.

కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు ఆ విజయాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడతారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా జట్టులోని ఆటగాళ్లు వీటిని సీరియస్‌గా తీసుకోరు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత మా వాళ్లు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజేతలుగా నిలిచారు. అయితే, కొంతమంది మాత్రం సొంత దేశ ఆటగాళ్లను, జట్టును కించపరుస్తున్నారు. ఇది సరికాదు’’ అని గంభీర్‌ కీర్తి ఆజాద్‌కు చురకలు అంటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement