ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్ కోసం నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్, తలకు హెల్మెట్ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది.
కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ భారత్ మాత్రం 1-2 తేడాతో కివీస్‌కు సిరీస్ కోల్పోయింది. ఇక ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో కోహ్లీ 144 స్ట్రైక్‌రేట్‌తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్‌ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.
చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!


