టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.
తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!
అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.
అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.
హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసి
అయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.
అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.
సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.
గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం
గిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.
ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.
కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.
ఇషాన్ విషయంలోనూ..
అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్‌లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.
మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటు ఇషాన్.. అటు సంజూ
ఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'
⭐ 2007 ⭐ 2024 ⭐ 2026
History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026


