టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత తుది జట్టులోనే లేని శాంసన్ ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్‌లో సంజూ (97, 89, 89) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శాంసన్.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకున్నప్పటికి.. సంజూను సరిగ్గా ఉపయోగించుకోవడంలో గంభీర్ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌లలో శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడాన్ని అతడు తప్పుబట్టాడు.
"సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్రమైన తప్పిదాలు చేసింది. దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై ఓపెనర్‌గా వచ్చి సంజూ వరుస సెంచరీలతో సత్తాచాటాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కేవలం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డర్‌కు డిమోట్ చేశారు.
దీంతో శాంసన్ తన రిథమ్‌ను కోల్పోయాడు. ఈ కారణంతో అతడిని తుది జట్టు నుంచి సైతం తప్పించారు. అయితే ఒక మ్యాచ్‌కు
రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మళ్లీ అవకాశం దక్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్‌ను బ్యాటింగ్‌కు పంపారు.
కిషన్ స్దానంలో సంజూ మళ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. ఈసారి అతడు దుమ్ములేపాడు. ఏకంగా తన అద్భుత ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన సంజూ చరిత్రను తిరగరాశాడు. అతడికి ఓపెనింగ్ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్ తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'


