ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయం
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వరుసగా రెండోసారి జట్టు టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2024లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన అతను... ఈసారి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డుతో తన విలువను ప్రదర్శించాడు. ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్‌లు, మ్యాచ్‌లలోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో టి20 వరల్డ్ కప్ తర్వాత అతని ప్రాధాన్యతలు కూడా మారబోతున్నాయి.
ఇకపై 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందు కోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో అతను ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. టి20 మ్యాచ్‌ల నుంచి చాలా వరకు అతను విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో పాటు 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ కూడా టి20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. అయితే ఈ రెండు మెగా ఈవెంట్లు మినహాయించి మిగతా టి20 మ్యాచ్‌లలో ఎక్కువ భాగం బుమ్రా ఆడే అవకాశం తక్కువగా ఉంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత వన్డేలపైనే అతను పూర్తి స్థాయి దృష్టి పెడతాడు. అయితే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కూడా కీలకం కాబట్టి టెస్టుల నుంచి బుమ్రాకు విశ్రాంతి లభించడం కష్టమే. ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలిసి బుమ్రా గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. బుమ్రా ఫిట్‌నెస్ తమకు అన్నింటికంటే ముఖ్యమని, పెద్ద ఈవెంట్లలో అతని ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పని లేదని, వరల్డ్ కప్‌కు ముందు ఉండే 30–35 వన్డేల్లో బుమ్రా బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.


